న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి, స్వచ్ఛ భారత్ సందేశాన్ని వినిపించారు. ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడవను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ క్రమం లోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్ సీసాను సేకరించారు. సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అంతర్భాగమే ఈ ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్. సెంట్రల్ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగంగా ఇక్కడికి చేరుకునేలా రూ. 920 కోట్లకు పైగా కేంద్ర వ్యయంతో ఈ రవాణా కారిడార్‌ను నిర్మించారు. ‘ ఈ ప్రాజెక్టుకు కొవిడ్‌తో సహా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. న్యాయ వివాదాలు అడ్డుపడ్డాయి. కానీ చివరకు సాధించాం ’ అని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.