Sunday, January 19, 2025

భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

జనవరి 4న, లక్షద్వీప్‌లోని భారత దేశ బీచ్‌ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ దేశంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలుగా పేరొందిన బీచుల ప్రాధాన్యతను తగ్గించే విధంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలున్నాయనే అపోహతో ముగ్గురు మాల్దీవుల జూనియర్ మంత్రులు గుప్పించిన విమర్శలు రెండు దేశాల మధ్య దౌత్యపరంగా ప్రతిష్టంభనకు దారితీశాయి. పర్యాటక కేంద్రంగా మాల్దీవులను బహిష్కరించాలని భారతీయ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభం కావడంతో వెంటనే ఆ ముగ్గురు జూనియర్ మంత్రులను తొలగించడం ద్వారా మాల్దీవుల ప్రభుత్వం నష్టనివారణకు దిగింది. ఎందుకంటె, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ అంతా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది. జిడిపిలో నాల్గవ వంతు కన్నా ఎక్కువగా ఈ రంగం నుండి సమకూరుతుంది. ముఖ్యంగా 2020 నుండి చైనా, ఐరోపా దేశాల నుండి కన్నా భారత్ నుండే ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు.

అయితే, ఈ వివాదం తలెత్తడానికి కేవలం ప్రధాని మోడీ ఇచ్చిన ఓ చిన్న సోషల్ మీడియా పోస్ట్ మాత్రం కారణం కాదని గ్రహించాలి. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికైనప్పటి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తత నెలకొన్నది. చైనా అనుకూల వ్యక్తిగా పేరొందిన ముయిజ్జు తమ దేశంలో ఉంటున్న భారత సైనిక దళాలను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఎన్నికల ప్రచార సమయం నుండే స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే, కేవలం భారత్ పర్యాటకులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థ కారణంగానే కాకుండా వ్యూహాత్మక అంశాలలో కూడా భారత్‌తో సంబంధాలు ఆ దేశానికి కీలకమని గమనించాలి. అందుకనే ఈ వివాదం విషయంలో ఒక విధంగా ఆ దేశ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా సముద్ర ప్రాంత రక్షణ విషయంలో భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా వ్యవహరించడం ఈ దేశానికి అత్యవసరం. భారత దేశ పర్యాటకులు ఆ దేశానికి ఎంత ముఖ్యమో వారిని చేర వేసే విమానాల దగ్గర నుండి పలు అంశాలలో భారత దేశ ప్రయోజనాలు సైతం ఇమిడి ఉన్నాయని గుర్తించాలి. ఇటీవల మాల్దీవుల నివాసితులు ఆరోగ్య సంరక్షణ కోసం భారత దేశంపై ఎక్కువగా ఆధారపడడం ప్రారంభించారు.

మాల్దీవులలోని ప్రధాన ప్రభుత్వ అనుబంధ ఆస్పత్రి, రాజధానిలోని ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, భారత ప్రభుత్వం సహాయంతో నిర్మించబడింది. రాబోయే ఐదేళ్ల అధ్యక్షుడుగా ముయిజ్జు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను కాపాడుకోవడం రెండు దేశాల ప్రయోజనాల రీత్యా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.ముఖ్యంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నైబర్ హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా మాల్దీవులతో సానుకూల సంబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నది.
అయితే, ప్రస్తుత పరిణామాలతో పాటు, ఆ దేశం అనుసరిస్తున్న చైనా అనుకూల విధానాలతో భారత దేశం తన వ్యూహాన్ని ఎలా మారుస్తుంది? అన్నది ఆసక్తి కలిగిస్తుంది. ఆ దేశపు గత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, మాల్దీవుల విదేశాంగ విధానంలో ‘ఇండియా ఫస్ట్’ విధానం అనుసరించేవారు. ఈ అంశం గత ఏడాది ఆ దేశ ఎన్నికలలో సైతం కీలక రాజకీయ అంశంగా మారింది.తమ దేశంలో భారతీయ సైనికులకు స్థావరం కల్పించే విషయంలో ఈ దేశంలో రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఆసియాలోని అనేక ద్వీప దేశాల మాదిరిగానే, చైనా, భారతదేశం, అమెరికా వంటి పెద్ద ఆసియా- పసిఫిక్ దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రాంతంలో తన ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను పెంపొందించడానికి తమదైన మార్గం అనుసరించే ప్రయత్నం మాల్దీవులు చేస్తున్నారు. ఆ దిశలో తమ దేశ విదేశాంగ విధాన ప్రాధాన్యతలను ఏర్పరచుకోవాలని, భద్రతా కార్యకలాపాల నిర్వహణలో మరింత స్వతంత్రతను అనుసరించాలని కోరుకునే ఓ పార్టీ నేతను ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న వాస్తవాన్ని గుర్తించాలి. ఎన్నికల ప్రచార సమయం లో ప్రకటించిన విధంగా భారత దేశంతో మాల్దీవుల వైమానిక భద్రతా సహకార కార్యక్రమం ముగియడానికి దారితీసినప్పటికీ, భారత్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు ముయిజ్జు తన పదవీ కాలం ప్రారంభంలోనే స్పష్టం చేశారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానిలకు పంపిన సందేశంలో అధ్యక్షుడు ముయిజ్జు ఇరు దేశాల మధ్య కొన్ని వందల ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, బంధాన్ని గుర్తు చేసుకోవడం గమనార్హం.

మాల్దీవుల రక్షణ దళాల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం పట్ల దృష్టి సారిస్తూ జూన్‌లో ముగియనున్న మాల్దీవులతో భారతదేశపు హైడ్రోగ్రఫీ భద్రతా సహకార ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని ముయిజ్జు డిసెంబర్ మధ్యలో నిర్ణయించారు. హిందూ మహా సముద్రంలో భద్రత వ్యవస్థపై తన పట్టుకోసం భారత్‌కు మాల్దీవుల రక్షణ విధానంలో ప్రాధాన్యత అవసరం అవుతుంది. అయితే, రక్షణ వ్యవస్థలో సామర్థ్యం పెంపొందించుకునేందుకు భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల సహకారం కూడా ఇప్పుడు కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామమే భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నది. ముయిజ్జుతో వ్యవహరించే విషయంలో భారత్ ఇంకా స్పష్టమైన వ్యూహం రూపొందించుకున్నట్లు కనిపించడం లేదు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన సమయంలో భారత ప్రతినిధిగా కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు హాజరయ్యారు. 2018లో అప్పటి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంకు స్వయంగా ప్రధాని మోడీ హాజరు కావడం గమనార్హం. కానీ ఇప్పుడు ఓ జూనియర్ మంత్రిని పంపడం ద్వారా ఈ ప్రభుత్వంతో సంబంధాల విషయంలో భారత్ కొంత వెనుకడుగు వేస్తున్నదనే సంకేతం పంపినట్లయింది.

మాల్దీవుల సంప్రదాయం ప్రకారం దేశ అధ్యక్షుడు మొదటి అధికార పర్యటనకు భారత్‌ను సందర్శిస్తుంటారు. ఆ విధంగా ముయిజ్జు కూడా భారత్ సందర్శనకు ఆసక్తి చూపినా న్యూఢిల్లీ నుండి తగు స్పందన లేకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. దానితో ముయిజ్జు నవంబర్‌లో తన మొదటి అధికారిక విదేశీ పర్యటనగా టర్కీని సందర్శించారు. ఆ తర్వాత జనవరిలో చైనాలో పర్యటించారు. ఈ మధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన కాప్ 28 సదస్సు సందర్భంగా డిసెంబర్ ప్రారంభంలో మోడీ, ముయిజ్జు కలుసుకోగలిగారు. అభివృద్ధి సహకారం,ఆ దేశంలో తన సేనలను భారత్ ఉపసంహరించుకోవడం వంటి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడానికి ఒక ఉన్నత స్థాయి కోర్ గ్రూపును ఈ సందర్భంగా ఏర్పాటు చేయగలిగారు. మార్చి 15 లోగా భారత్ తన సేనలను ఉపసంహరించుకోవాలని ఆ దేశం స్పష్టం చేసింది. దాదాపు అదే సమయంలో భారత్‌లో ఎన్నికలు ఉండడంతో రెండు దేశాల మధ్య సంబంధాలలో ఈలోపుగా చెప్పుకోదగిన పరిణామాలు సంభవించే అవకాశం ఉండకపోవచ్చు.
సోషల్ మీడియా పోస్ట్ కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తిన సమయంలోనే చైనా పర్యటనలో ఉన్నమాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆ దేశంతో అనేక కొత్త ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుదిరిన 20 ఒప్పందాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

వీటిల్లో పర్యాటకం, మత్స్య పరిశ్రమ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం వంటి విభిన్న సహకార రంగాలను సంబంధించి ఉన్నాయి. అయితే, భద్రతాపరంగా భారత్ స్థానంలో చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునే సూచనలు ఈ ఒప్పందాలలో కనిపించడం లేదు. ఏదేమైనా మాల్దీవుల తీరంలోకి చైనా నిఘా ఓడలు రావడం, భద్రతా పరమైన చర్యలకు పూనుకొనే ప్రయత్నాలు జరగడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం కాగలదు. భారత దేశం- మాల్దీవులు ద్వైపాక్షిక సంబంధాలు భాషా, సాంస్కృతిక, మత, వాణిజ్యపరంగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాయి. 1965లో స్వాతంత్య్రం పొందిన తర్వాత మాల్దీవులతో దౌత్యపర సంబంధాలు ఏర్పరచుకున్న మొదటి దేశం భారత్. భారత దేశపు పశ్చిమ తీరానికి మాల్దీవులు చాలా దగ్గరగా (కేవలం 70 నాటికల్ మైళ్ల దూరంలో) ఉంది. భారత దేశం పశ్చిమ తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రం గుండా సాగే వాణిజ్య సముద్ర మార్గాలు భారత దేశానికి ముఖ్యమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగినవి. మాల్దీవులకు సైతం వ్యూహాత్మకంగా భారత దేశం కీలకమైనది.

మాల్దీవులతో భారత దేశ సంబంధం విషయంలో ఎటువంటి రాజకీయ వివాదాస్పద సమస్యలకు తావు లేవు. 1988లో అక్కడి ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగినప్పుడు భారత్ తక్షణం స్పందించి సహకారం అందించినప్పటి నుండి ముఖ్యంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. 2004 సునామీ, నీటి సంక్షోభం సమయంలో మాల్దీవులకు సహాయం చేసిన మొదటి దేశం భారత దేశం. అందుకనే భారత్ -మాల్దీవులు దౌత్యపరంగా మరింత పరిణితితో వ్యవహరించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News