Wednesday, January 22, 2025

మన్మోహన్ చక్రాల కుర్చీలోనూ పని చేశారు:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభలో త్వరలో 56 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సభలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు. ‘ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవ అపారం. రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్( అధికార పక్షం) గెలుస్తుందని తెలిసినా ఆయన వీల్‌చైర్‌లో వచ్చి ఓటేశారు.

ఓ సభ్యుడిగా తన విధుల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారనేదానికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పని చేశారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శం’ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రిటైరవుతున్న సభ్యులకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ సింగ్ 1991లోఆర్థిక మంత్రి అయిన తర్వాత రాజ్యసభకు మొదటి సారి ఎంపికయ్యారు.అప్పటినుంచి 2019 దాకా వరసగా ఆరు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌నుంచి పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 3తో ముగుస్తుంది.

మీరు ప్రధాని అయితే కాంగ్రెస్ సహిస్తుందా?
ఖర్గేకే దేవెగౌడ ప్రశ్న

ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ సంస్కృతిపై విమర్శలు గుపించారు. ‘ మీరు దేశ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ సహిస్తుందా?’ అని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించారు. తన జీవిత చరమాంకంలో తన రాజకీయ జీవితం కొత్త మలుపు తిరిగిందని ఖర్గే చేసిన వ్యాఖ్యలను దేవెగౌడ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నేతలు తమ పార్టీ అయిన జెడి(ఎస్)ను నాశనం చేయాలని అనుకున్నందునే దాన్ని కాపాడుకోవడం కోసం బిజెపికి మద్దతు ఇచ్చిందని దేవెగౌడ చెప్పారు. ఖర్గే నిజాయితీని, తన రాజకీయ కెరీర్‌లో ఆయన అందించిన మద్దతును కొనియాడుతూ కర్నాటకలో తన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం పతనం

కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.తన కుమారుడు కాకుండా ఖర్గే ముఖ్యమంత్రి కావాలని తాను అప్పుడు సూచించానని, అయితే కాంగ్రెస్ హైకమాండ్ కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టిందని దేవెగౌడ చెప్పారు. ‘అయితే 13 నెలల్లోపే ఆయనను ముఖ్యమంత్రి పదవినుంచి ఎవరు తొలగించారు? ఆ పని చేసింది ఖర్గే కాదు, కాంగ్రెస్ నేతలు’ అని స్పష్టం చేశారు. ‘ఖర్గేగారూ, మీరు ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారా?దాన్ని కాంగ్రెస్ సహిస్తుందా?చెప్పండి. నాకు కాంగ్రెస్ గురించి తెలుసు’ అని కూడా దేవెగౌడ అన్నారు. వ్యక్తిగత లాభం కోసం తాను ఒకపార్టీనుంచి మరో పార్టీకి మారలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ చేస్తున్న సభ్యులు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, సమాజ్‌వాది పార్టీ సభ్యురాలు జయాబచ్చన్, తిరుచ్చి శివ( డిఎంకె), కె. కేశవరావు( బిఆర్‌ఎస్), నారాయణ్ దాస్ గుప్తా(ఆప్), వశిష్ట నారాయణ్ సింగ్( జెడి(యు) సులతా దేవ్( బిజెడి), నదీముల్ హక్( ఎఐటిసి), కనకమేడల రవీంద్ర కుమార్( టిడిపి), అమీ యాజ్ఞిక్( కాంగ్రెస్), జికె వాసన్(తమిళమానిల కాంగ్రెస్‌ఎం), బి లింగయ్య యాదవ్( బిఆర్‌ఎస్)కూడా మాట్లాడారు. కాగా పురుషోత్తం రూపాల గుజరాతీలో మాట్లాడడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News