Monday, January 20, 2025

ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ప్రధాని మోదీ ప్రశంస

- Advertisement -
- Advertisement -

PM Modi Praises on Frontline Workers

న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకాకరణకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అందరినీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శాస్త్రవేత్తలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను ట్విటర్ వేదికగా ఆదివారం అభినందించారు. ఈ మహమ్మారిపై పోరాటానికి వ్యాక్సినేషన్ గొప్ప బలాన్ని ఇచ్చిందన్నారు. “నేడు టీకాకరణ కార్యక్రమానికి ఒక ఏడాది పూర్తయింది. దీనితో సంబంధంగల అందరికీ వందనం చేస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి టీకాకరణ కార్యక్రమం గొప్ప బలాన్ని ఇచ్చింది. ప్రాణాలను రక్షించడానికి, జీవనోపాధిని కాపాడటానికి ఇది దోహదపడింది” అని మోదీ పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు ఈ సంక్షోభ సమయంలో నిర్వహించిన పాత్రను మోదీ ప్రశంసించారు. వీరంతా అసాధారణ సేవలు అందజేశారని ప్రశంసించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు టీకాకరణ జరుగుతున్న దృశ్యాలు, హెల్త్‌కేర్ వర్కర్స్ టీకాలను అక్కడికి తీసుకెళ్తున్న దృశ్యాలు మన మనసులు, హృదయాలు గర్వంతో నిండిపోయేలా చేస్తున్నట్లు తెలిపారు.

బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సందర్భంగా ఇచ్చిన ట్వీట్‌లో, దేశ జనాభానుబట్టి చూసినపుడు టీకాకరణ అసాధ్యంగా కనిపించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో ఇది సాధ్యమైందన్నారు. దేశ జనాభాలో దాదాపు 92 శాతం మంది టీకాలు పొందారన్నారు. దాదాపు 156 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి 99 కోట్ల డోసులు ఇచ్చినట్లు తెలిపారు. వయోజనుల్లో 70 శాతం మంది టీకాలు పూర్తిగా (రెండు డోసులు) పొందారన్నారు. 3 కోట్ల మందికి పైగా బాలలు మొదటి డోసు పొందినట్లు చెప్పారు. కోవిడ్-19పై పోరాటానికి భారత దేశం నాయకత్వం వహిస్తోందన్నారు.

PM Modi Praises on Frontline Workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News