Thursday, January 23, 2025

ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై సాగుతోన్న పలు కుట్రల్లో భాగం అయిన ఉగ్రకుట్రల ఆధారంగా ఈ సినిమా తీశారని చెప్పిన ప్రధాని , తీవ్రవాదానికి సంబంధించిన చేదునిజాన్ని ఈ చిత్రంలో బాగా చూపారని తెలిపారు. త కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వివాదాస్పద కథాంశంతో రూపొందిన ది కేరళ స్టోరీ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమాలో నిజాలు చూపారు. భారతీయ సంస్కృతిని, ప్రగతిని అడ్డుకునే విద్వేషశక్తుల తీరును సినిమాతో ఎండగట్టారని, అయితే ఈ సినిమా ప్రదర్శనకు నోచుకోకుండా చూస్తోన్న కాంగ్రెస్ ఏకంగా ఉగ్రవాదం పట్ల మోకరిల్లిందని, తన ఓటు బ్యాంకులను రక్షించుకునేందుకు చివరికి దేశ ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులకు కూడా వత్తాసు పలికిందని మోడీ విమర్శించారు. ఉగ్రవాదం, సంబంధిత శక్తి పలు రూపాలలోకి విస్తరించుకుని పోతోంది.

ఉగ్రవాదం అంటే ఇంతవరకూ విధ్వంసకర చర్యల దిశగా ఉండేది. ఆయుధాలు మందుపాతరల క్రమం సంతరించుకునేది. అయితే ఇప్పుడు భారతీయ సమాజాన్ని బయటి నుంచి లోపలి నుంచి మరింతగా శక్తిహీనం చేసేందుకు పలు రూపాలను ఎంచుకొంటోందని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదం అమానుషం , తిరోగమన ప్రతీక, దీని పట్ల ప్రపంచం అంతా ఆందోళన చెందుతోంది. భారతదేశం దీర్ఘకాలికంగా ఉగ్రగాయాలను చవిచూసిందని ప్రధాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుది విడత తొలి రోజున మోడీ బళ్లారి, తూముకూర్‌లలో మాట్లాడారు. ఈ దశలో ఆయన కాంగ్రెస్ తీరు స్పష్టతిస్పష్టంగా ఉగ్రవాద వత్తాసు దిశలో ఉందని, కేవలం తన ఓట్లు రక్షించుకునేందుకు చివరకు దేశ విద్రోహశక్తులకు కూడా వత్తాసు పలకడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఉగ్ర ధోరణుల శక్తుల పట్ల మెతక వైఖరిని ప్రదర్శించే కాంగ్రెస్ కర్నాటకను కాపాడగలదా? మీరే ఆలోచించాలని సభికులను మోడీ ప్రశ్నించారు.

సమున్నత స్థాయి సమాజాన్ని పలు స్థాయిల్లో పలు రీతుల్లో డొల్లగా చేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సి ఉందన్న ప్రధాని కర్నాటకలో ఓటర్లు సంపూర్ణ స్థాయిలో బిజెపికి మద్దతు ఇచ్చి ప్రభుత్వం తిరిగి వచ్చేలా చూడాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని ప్రస్తావించారు. కేరళ కష్టపడి పనిచేసే వారికి, ప్రతిభావంతులకు, మేధావులకు వేదిక . అయితే ఈ నేలపై ఉగ్రవాద కుట్రలు మతం పేరిట వెళ్లూనుకుని ఏ విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశాయనే విషయాన్ని కేరళ స్టోరీలో సమగ్రంగా వాస్తవికంగా చిత్రీకరించారని మోడీ కితాబు ఇచ్చారు. తమ పార్టీ ఉగ్రవాదం అణచివేతకు కట్టుబడి ఉందని, దీనికి భిన్నంగా కాంగ్రెస్ సమయం దొరికినప్పుడల్లా ఉగ్రవాదంపై శీతకన్ను వేసిన సందర్భాలు ఉన్నాయని, ఇక తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక అంతా కూడా కర్నాటకను నెంబరు 1గా తీర్చిదిద్దడంపై ఉందని, కాంగ్రెస్ వాగ్థాన పత్రంలో ఆ సంస్థను రద్దు చేయడం ఈ సంస్థను రద్దు చేయడం , పథకాలను తీసిపారేయడం వంటి అంశాలు ఉన్నాయని విమర్శించారు.

జై బజ్‌రంగ్ బలి అంటే కూడా తప్పేనా

కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓ వర్గాన్ని మచ్చిక చేసుకుని సాగే వ్యవహారాలే అని విమర్శించిన ప్రధాని కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజ్‌రంగ్ దళ్‌ను నిషేధిస్తామని చేసిన హామీని ప్రస్తావించారు. వారికి దేనిపై ప్రేమనో దేని పట్ల ద్వేషమో తనకు తెలియడం లేదన్నారు. చివరికి తాను జై బజ్‌రంగ్ బలి అన్నా వారికి నచ్చడం లేదని, అయితే తాను బజ్‌రంగ్ బలికి జై అని చెపుతూనే ఉన్నానని ప్రధాని తెలిపారు.

కేరళ స్టోరీ విషయం వివాదం

శుక్రవారం ది కేరళ స్టోరీ విడుదలకు సిద్ధం అయింది. కేరళలో ఈ సినిమా విడుదలపై స్టే మంజూరికీ కేరళ హైకోర్టు నిరాకరించింది. ఈ సినిమాలో ఇస్లామ్‌కు లేదా ముస్లింలకు వ్యతిరేకంగా ఏమీ లేదని, కేవలం ఐఎస్‌ఐఎస్ ప్రేరేపిత మతాంతీకరణ చర్యలను ప్రస్తావించారని తెలిపింది. హైకోర్టు స్టే వెలువరించిన రోజునే పొరుగు రాష్ట్రంలో ఎన్నికల సభలో ప్రధాని ఈ అంశంపై ప్రస్తావించారు. ది కేరళ స్టోరీ సినిమాలో కేరళకు చెందిన యువతులు అత్యధిక సంఖ్యలో ముస్లింలుగా మారి ఐఎస్‌ఐఎస్‌లో చేరారని చిత్రీకరించారు. సంఘ్ పరివార్ అజెండాలో భాగంగానే ఈ సినిమా వచ్చిందని కేరళ సిఎం పినరయి విజయన్, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కొచ్చిలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News