తిరుచిరాపల్లి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు పఠించిన కంభ రామాయాణాన్ని ప్రధాని మోడీ ఆలకించారు. తెల్లని ధోవతి, అంగవస్త్రం ధరించి ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని మోడీ శ్రీ మహావిష్ణు రూపమైన రంగనాథ స్వామివారిని కొద్దిసేపు ప్రార్థించారు. ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట ఈ నెల 22న జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ వారంలోనే దక్షిణాదిలో రామాయణంతో సంబంధమున్న సందర్శించిన మూడవ ఆలయమిది.
ఈ వారం మొదట్లో ఆయన ఆంధ్రపద్రేశ్‌లోని లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. రాయాణంలోని జటాయువు వృత్తాంతంతో సంబంధమున్న ఆలయమది. ఆ తర్వాత ఆయన కేరళలోని త్రిసూర్‌లో శ్రీ రామస్వామి ఆలయాన్ని దర్శించారు. శ్రీరాముడు, ఆయన సోదరులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ప్రతీతి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అర్చకులు ప్రధాని మోడీకి వఠారితో ఆశీర్చవనాలు అందచేశారు. ఆలయ ప్రాంగణంలోని వైష్ణవ మత గురువు శ్రీ రామానుజార్యులు, చక్రత్తాళ్వార్‌తోసహా ఇతర దేవతామూర్తుల సన్నిధులను ప్రధాని దర్శించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఏనుగుకు ఆహారం అందచేసి ఆదీవెనలు అందుకున్నారు.