Saturday, November 2, 2024

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

PM Modi prays at Kedarnath temple

ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
రూ.400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

డెహ్రాడూన్/ కేదార్‌నాథ్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది గురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విగ్రహం ముందు కూర్చున్నప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించడానికి తనకు మాటలు చాలవన్నారు. ఈ శతాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినదని, రాబోయే సంవత్పరాల్లో ఈ ప్రాంతానికి రాకపోకల సదుపాయం గణనీయంగా పెరుగుతుందని, అప్పుడు ఈ ప్రాంతంనుంచి వలసలు తగ్గుతాయని ప్రధాని అన్నారు. శుక్రవారం ఉదయం డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టెనెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాదర స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక విమానంలో కేదార్‌నాథ్ చేరుకున్న మోడీ అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేదారేశ్వరుడికి హారతి సమర్పించారు. అనంతరం ఆదిశంకరాచార్య సమాధి వద్ద 12 అడుగుల ఎత్తయిన ఆదిగురువు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వరదల ధాటికి కేదారనాథ్ ఆలయం పరిసరాలతోపాటు ఆదిశంకరాచార్య సమాధి కూడా ధ్వంసమైంది. 2019లో ఈ సమాధి పునర్నిర్మాణంతో పాటుగా ఆదిశంకరాచార్య విగ్రహ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువుండే ఈ విగ్రహాన్ని కర్నాటకలోని మైసూరు శిల్పులు రూపొందించారు. ఆలయంలో పూజల తర్వాత ప్రధాని ఆలయం వెనుక ఉన్న ‘భీమ్ శిల’ వద్దకు కాలి నడకన వెళ్లారు. 2013 జూన్‌లో వచ్చిన వరదల సమయంలో భారీ శిల కొండలపైనుంచి కిందికి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా ఆలయం వెనుక ఆగింది. దీనివల్లనే ఆలయం వరదల్లో దెబ్బతినకుండా కాపాడబడిందని భక్తుల విశ్వాసం. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేదార్‌పురి ప్రాంతంలో దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన పునర్నిర్మాణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News