Thursday, January 23, 2025

మోడీ-బైడెన్ చర్చలు

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession  భారత, అమెరికాల మధ్య మామూలుగా జరిగే చర్చలే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈసారి విశేషమైన ఆసక్తిని రేకెత్తించాయి. మొన్న సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య దృశ్యమాధ్యమం ద్వారా ఏర్పాటైన వర్చువల్ సమావేశంలో ఏమి జరిగిందోననే ఉత్కంఠ నెలకొన్నది. ఇటువంటి సమావేశాలు పరస్పర గౌరవ మర్యాదలకు లోటు లేకుండానే సాగిపోతుంటాయి. మోడీ, బైడెన్‌ల మధ్య చర్చలు కూడా అలాగే జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను నేరుగా ఖండించాలంటూ ఇండియా మీద వొత్తిడి ఊపందుకున్నది. అమెరికన్ శిబిరం నుంచే ఈ వొత్తిడి వస్తున్నదని ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. బైడెన్, మోడీల మధ్య వర్చువల్ చర్చల్లో కూడా యుద్ధమే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. రష్యా, ఉక్రెయిన్ అధినేతలిద్దరితోనూ తాను చాలా సార్లు మాట్లాడానని, యుద్ధం మాని చర్చల బాట పట్టమని చెప్పానని, వారిద్దరూ ముఖాముఖీ సంప్రదించుకోడం అవసరమని హితవు పలికానని ప్రధాని మోడీ బైడెన్‌కు వివరించినట్టు తెలిసింది.

బుచా ఊచకోత హత్యాకాండను ఇండియా ఖండించిన విషయాన్ని కూడా బైడెన్‌తో చర్చల్లో ప్రధాని మోడీ ప్రస్తావించినట్టు వెల్లడైంది. అయితే రష్యాను నేరుగా ఖండించకపోడం పట్ల ఇండియాపై అమెరికా అసంతృప్తిగా వున్న విషయం స్పష్టపడుతున్నది. రష్యాతో మంచి సంబంధాలున్న దేశాలు యుద్ధం త్వరలో ముగిసేలా చేయడానికి కృషి చేయాలని అమెరికా కోరుకుంటున్నట్టు వెల్లడైంది. అంతకు మించి ఈ విషయంలో అమెరికా కఠినమైన వైఖరి ని అవలంబించిన దాఖలాలు లేవు. ఎందుకంటే తనకు అత్యంత సన్నిహితమైన యూరప్ దేశాలు తన మాటను కాదని రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. అందుచేత యూరప్ పట్ల మెతకగా వుండి భారత్ వంటి దేశాల పట్ల కఠినంగా వ్యవహరించగల స్థితిలో అమెరికా లేదు. ‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల తలెత్తుతున్న అస్థిర పరిస్థితుల ప్రభావాలను ఏ విధంగా పరిమితం చేయాలనే విషయంపై అమెరికా, ఇండియాలు సన్నిహిత సంప్రదింపులు కొనసాగిస్తాయని బైడెన్ దౌత్యపరిభాషలో పలికిన పలుకులు గమనించదగినవి. అలాగే యుద్ధ బీభత్సాన్ని అనుభవిస్తున్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ ఇస్తున్న మానవతా మద్దతు పట్ల హర్షం వెలిబుచ్చుతున్నట్టు బైడెన్ తెలియజేశారు.

అలాగే దక్షిణాసియా, భారత్ పసిఫిక్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి అంశాలు, కొవిడ్ అనంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తదితరాలు మోడీ, బైడెన్‌ల మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ చర్చల అనంతరం కూడా రష్యా పట్ల భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోడం మన విదేశాంగ విధాన పటిష్ఠతను చాటుతున్నది. బైడన్, మోడీల మధ్య వర్చువల్ సమావేశంతో బాటుగానే రెండు దేశాల విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య తరచూ జరిగే చర్చలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ చేసిన ఒక వ్యాఖ్య ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం తీసుకున్న వైఖరి నుంచి సడలిపోడం గాని, వెనుదిరగడం గాని జరగదని జైశంకర్ వ్యాఖ్య నిరూపించింది. యుద్ధం విషయంలో భారత దేశం వహించిన అలీన, తటస్థ వైఖరిపై అమెరికాలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జైశంకర్ ఎటువంటి నీళ్లనములుడు లేకుండా సూటిగా చేసిన వ్యాఖ్య ఇండియాలో మోడీ ప్రభుత్వానికి ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది’. రష్యా నుంచి భారత్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న దానిపై మీరు ఆసక్తి చూపుతుంటే నేనొక విషయం చెప్పదలచుకున్నాను. మేము మా ఇంధన భద్రత కోసం రష్యా నుంచి కొంత ఆయిల్‌ను కొంటున్న మాట వాస్తవం. అయితే నెల రోజుల్లో రష్యా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ యూరప్ దేశాలన్నీ ఒక మధ్యాహ్నం పూట దాని నుంచి కొనుక్కుంటున్నంత దానితో కూడా సమానం కాదని తెలుసుకోవలసి వుంది అని జైశంకర్ అక్కడి మీడియాకి మొహమ్మీద గుద్దినట్టు స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత కూడా రష్యా నుంచి యూరప్ చమురు దిగుమతికి స్వస్తి చెప్పకపోడమే అమెరికాను తీవ్రమైన ఇరకాటంలో పడేసింది. ఇంధనం విషయంలో అమెరికా స్వయం సమృద్ధంగా వున్నప్పటికీ యూరప్ దేశాలు అందుకు భిన్నంగా పూర్తిగా ఆధారపడి వున్నాయి. ప్రత్యక్ష యుద్ధంలో ప్రాణాలకు తెగించడం వేరు, తమ ప్రజల నిత్యావసరమైన సరకుల విషయంలో రాజీపడడం వేరు. అలా రాజీపడడం వల్ల కోట్లాది మంది ప్రజల బతుకులు దుర్భరమవుతాయి. యూరప్ దేశాల ప్రభుత్వాలు రష్యాపై కోపంతో దాని నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకోడం మానేస్తే అవి మరో శ్రీలంక అయ్యేవి. ఈ వాస్తవికతను గమనించి అమెరికా సూచనను ధిక్కరించడానికి అవి వెనుకాడలేదు. తన్ను మాలిన ధర్మం పనికి రాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News