Thursday, January 23, 2025

తిరిగి మాదే అధికారం: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ మూడో దఫా అధికార దశలో దేశం అసాధారణ రీతిలో ఆర్థిక ప్రగతి సాధిస్తుందని , ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒక్కటి అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తిరిగి తమ నేతృత్వపు ఎన్‌డిఎనే అధికారంలోకి వస్తుందని, భాతరదేశ ఆర్థిక ప్రగతి ప్రయాణం ఆగబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. యాఈ వాగ్ధానం తాను ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు. దేశ రాజధానిలోని ప్రగతిమైదాన్‌లో పునఃనిర్మించిన భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటిపిఒ)కు బుధవారం అధికారిక ఆవిష్కరణకు ముందు ఉదయం జరిగిన పూజాదికాల దశలో ప్రధాని మాట్లాడారు. కాంప్లెక్స్ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆయన కలుసుకుని వారితో మాట్లాడారు. నిర్మాణాన్ని అత్యద్భుతంగా పూర్తిచేసినందుకు వారిని అభినందించారు. సన్మానించారు.

సాయంత్రం ఇక్కడనే భారీ స్థాయిలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ (ఐసిసిసి)ను ఆరంభించారు. దీనికి భారత్ మండపం అని పేరు పెట్టారు. ఈ దశలో ఆయన తమ సందేశంలో తమ మూడోదఫా అధికార హయాం గురించి మాట్లాడారు. ఈ దశలో మూడు ప్రధాన ఆర్థిక శక్తివంత దేశాలలో ఇండియా ఒక్కటి అవుతుందన్నారు. తూర్పు నుంచి పశ్చిమం, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ భారతదేశపు సాధనాసంపత్తి బాగా మెరుగుపడుతోంది. ఈ మార్పు ఇప్పుడు తేటతెల్లం అయిందన్నారు. పలు విధాలుగా భారతదేశంలో ప్రతిష్టాత్మక నిర్మాణాలు వెలుస్తాయి. ప్రపంచ అతి ఎతైన రైలుబ్రిడ్జి ఇక్కడనే రాబోతోంది. ఇదే విధంగా అత్యంత ఎతైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్ , అత్యున్నత ప్రాంతంలో వాహనాల సంచార రాదారి, అతి పెద్ద స్టేడియం, అతిపెద్ద విగ్రహం ఈ విధంగా పలు ఘనతలను మనదేశం చాటుకుంటుందన్నారు.

తమ తొలి దశ అధికారంలో దేశ ఆర్థిక వ్యవస్థ పదవ స్థానంలో ఉంది. రెండో దశలో ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది.ఈ విధమైన గత నేపథ్య ఘనతలను తీసుకుంటే ఇక తమ మూడో దశ అధికార కాలంలో భారతదేశం ప్రపంచంలో మూడు అతి పెద్ద ఆర్థిక శక్తివంతమైన దేశాలలో ఒక్కటి అవుతుందన్నారు. ఇది దేశ ప్రజలకు మోడీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. తమ తొమ్మిదేళ్ల పాలన ప్రగతి ఒక్క ఎత్తయితే ఆరుదశాబ్దాలల్లో దేశ ప్రగతి ఫలితం ఒక్క ఎత్తని చెపుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ స్థలం నుంచి ఆయన రాజకీయ కోణంలో వ్యాఖ్యానాలు చేశారు. గడిచిన 60 ఏండ్లల దేశంలో కేవలం 20000 కిమీల మేర రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సంవత్సరాల్లోనే 40వేల కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విద్యుద్దీకరణ పనులు జరిగాయని తెలిపారు. ప్రతినెలా ఆరు కిలోమీటర్ల మెట్రోలైన్ పనులు జరుగుతున్నాయి. గ్రామాల రహదారులు మరింతగా ఏర్పడ్డాయి.

ఎయిర్‌పోర్టుల సంఖ్య 150కు చేరిందన్నారు. ఓ వైపు లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన దశలో ప్రధాని మోడీ ఈ ప్రగతిమైదాన్ వేదిక నుంచి ఖరాఖండిగా తాను మరో మారు అధికారంలోకి వస్తానని, తన మూడోటర్మ్‌లో దేశం మరింత ముచ్చటగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ వెలిసిన భారత్ మండపం జి 20 శిఖరాగ్ర సదస్సుకు సెప్టెంబర్‌లో వేదిక కానుంది. దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో రూ 2700 కోట్ల వ్యయంతో దీనిని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News