Monday, December 23, 2024

జౌళి రంగానికి అన్ని విధాల మద్దతు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జౌళి రంగానికి అన్ని విధాల మద్దతు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వాగ్దానం చేశారు. భారత్ స్వతంత్రమై నూరు సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో జౌళి రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. ఢిల్లీలో ‘భారత టెక్స్ 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, అభివృద్ధి భారత్ నిర్మాణంలో జౌళి రంగం పాత్రను పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోందని తెలియజేశారు. దేశంలో నిర్వహిస్తున్న అతి పెద్ద ప్రపంచ జౌళి రంగం కార్యక్రమాల్లో ఒకటి ‘భారత్ టెక్స్ 2024’. ‘రానున్న 25 ఏళ్లలో భారత్‌ను ‘వికసిత్ దేశం’గా మార్చాలని మేము తీర్మానించాం. వికసిత్ భారత్‌కు నాలుగు ముఖ్య స్తంభాలు పేదలు, యువత, రైతులు, మహిళలు. భారత జౌళి రంగానికి ఆ నాలుగు స్తంభాలతో అనుసంధానం ఉండడం గమనార్హం.అందువల్ల భారత్ టెక్స్ వంటి కార్యక్రమం ఎంతో ముఖ్యమైనది’ అని మోడీ పేర్కొన్నారు. 2014లో భారత జౌళి మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్లు కన్నా తక్కువగాఉండగా, ఇప్పుడు అది రూ. 12 లక్షల కోట్లు దాటిందని ఆయన తెలిపారు.

గడచిన పది సంవత్సరాలలో నూలు, వస్త్రం, దుస్తుల ఉత్పత్తిలో 25 శాతం పెరుగుదల ఉన్నదని ప్రధాని తెలియజేశారు. జౌళి రంగంలో నాణ్యత నియంత్రణపై ప్రభుత్వం ఎంతగానో దృష్టి కేంద్రీకరిస్తోందని మోడీ తెలిపారు. ‘మీ కృషిలో మీకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా నిబద్ధమై ఉంది’ అని ప్రధాని చెప్పారు. జౌళి రంగాలలో గ్రామీణ జనాభా, మహిళల ఉపాధి అవకాశాలు, భాగస్వామ్యం గురించి మోడీ ప్రస్తావిస్తూ, పది మంది దుస్తుల తయారీదారులలో ఏడుగురు మహిళలు అని, చేనేత రంగంలో ఆ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందని చెప్పారు. గడచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖాదీ రంగాన్ని పటిష్ఠమైన అభివృద్ధి మాధ్యమంగా, ఉద్యోగాల రంగంగా చేశాయని ఆయన తెలిపారు. అదే విధంగా గత దశాబ్దంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల పెంపుదలకు చేసిన కృషి వల్ల జౌళి రంగానికి లబ్ధి చేకూరిందని మోడీ చెప్పారు. పత్తి, జనపనార, పట్టు ఉత్పత్తి దేశంగా భారత్ ఖ్యాతి పెరుగుదల గురించి కూడా ప్రధాని వివరించారు. ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు అందజేస్తోందని, వారి నుంచి పత్తి కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరి పత్తి ప్రపంచవ్యాప్తంగా భారత్ బ్రాండ్ విలువ సృష్టిలో భారీ ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. దేశంలో జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్‌ఐఎఫ్‌టి) క్యాంపస్‌ల సంఖ్యను 19కి పెంచడంతో నైపుణ్యం, స్థాయిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని మోడీ తెలియజేశారు. నూతన టెక్నాలజీల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా స్థానిక నేత కార్మికులు, వృత్తి నిపుణులను ఎన్‌ఐఎఫ్‌టిలతో అనుసంధానిస్తున్నామని ప్రధాని తెలిపారు. వివిధ రాష్ట్రాలలో ఏడు పిఎం మిత్ర పార్క్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నదని కూడా ఆయన తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News