గత పదేళ్లలో తన ప్రభుత్వం చేసిన పనులు కేవలం ట్రయలర్ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని చురులో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ, గత పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో పెద్ద విషయమేమీ కాదని, ఇప్పటి దాకా జరిగిందంతా ట్రయలర్ మాత్రమేనని అన్నారు. ఇప్పటి వరకు మోడీ చేసినదంతా కేవలం అల్సాహారం మాత్రమే..విందు భోజనం ముందుంది అంటూ ప్రధాని చెప్పారు.
ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఎన్నో కలలు మిగిలి ఉన్నాయని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సైన్యాన్ని అవమానించిన కాంగ్రెస్ దేశౠన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని ప్రస్తావిస్తూ తాను ముస్లిం సోదరీమణుల జీవితాలనే కాక అన్ని ముస్లిం కుటుంబాల జీవాతాలను కాపాడానని ఆయన చెప్పారు. కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమికి సొంత ప్రయోజనాలు ఉన్నాయని, పేదలు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం, గౌరవం వాటికి పట్టదని ఆయన విమర్శించారు.