న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ సమస్యను భారత్ గట్టిగా లేవనెత్తుతోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వీడియో సందేశాన్ని ఆయన సోమవారం వినిపించారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం అన్ని దేశాలూ తమ స్వార్థపర ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించడం ముఖ్యమని పేర్కొన్నారు.
అగ్రదేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధ్ది నమూనా చాలా కాలంగా విరుద్ధంగా ఉంటోందని, ఈ నమూనా ప్రకారం మొదట తమ దేశం అభివృద్ధి చేద్దాం, తరువాత పర్యావరణం గురించి ఆలోచిద్దాం అన్న ధోరణి సాగుతోందని దశాబ్దాలుగా ఏ ఒక్కరూ దీనికి అభ్యంతరం చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో వాతావరణ న్యాయంపై భారత్ ఆయా దేశాల ముందు ప్రశ్నించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారత్ పర్యావరణంపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరిస్తోందని, 4జి, 5జి టెలికమ్ నెట్‌వర్క్‌లను భారత్ విస్తరించినట్టయితే ఆమేరకు సమాన స్థాయిలో అటవీ విస్తీర్ణాన్ని కూడా పెంచుతోందని వివరించారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సంకల్పం ప్లాస్టిక్ వినియోగాన్ని వదులుకోవడం అని, ఈ సమస్యపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తోందని, కానీ భారత్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి దీనిపై స్థిరంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. 2018లో భారత్ తనకు తాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వదులకోడానికి రెండు స్థాయిల్లో పనిచేయడం ప్రారంభించిందని, ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేయడం అనే పద్ధతులను అనుసరిస్తోందని వివరించారు. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీపై గత తొమ్మిదేళ్లుగా భారత్ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు.