Tuesday, November 5, 2024

పేదలు మురిసి పోయారట!

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ తాను మరచిపోయిన, తనకు ప్రీతిపాత్రమైన పెద్ద నోట్ల రద్దుపై ఇంత కాలం వహించిన మౌనానికి బుధవారం నాడు స్వస్తి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొని ఏడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో దేశంలోని పేద ప్రజలు తనను మెచ్చుకొన్నారని అన్నారు. వారు తన పట్ల కృతజ్ఞతా పూర్వకంగా వున్నారని ప్రధాని ఆత్మస్తుతికి పాల్పడ్డారు. అది అవినీతికి వ్యతిరేకంగా తీసుకొన్న గొప్ప నిర్ణయమని చెప్పుకొన్నారు. కరెన్సీ నోట్ల కట్టల మీద నిద్రపోయిన అవినీతిపరులు ఈ చర్యతో కంటి మీది కునుకు కోల్పోయారని చెప్పుకొన్నారు. అవినీతిపరులపై కఠిన చర్యలు ఆగబోవని కూడా ఉద్ఘాటించారు. 2016 నవంబర్ 8 నాడు రాత్రి 8 గం. లకు ప్రధాని మోడీ వున్నట్టుండి దేశ ప్రజలనుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగించారు.

దేశంలోని గుప్త ధనాన్ని, దొంగ నోట్లను రద్దు చేసి ఆర్థిక వ్యవస్థలో నీతికి పట్టం కట్టడం కోసం రూ. 500, రూ. 1000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అది దేశ ప్రజల వెన్నెముకల్లో చెప్పనలవి కానంత వణుకు పుట్టించింది. అప్పటికప్పుడు తమ వద్ద గల రెండు పెద్ద నోట్లు విలువ కోల్పోయి ఎందుకూ పనికి రాకుండా పోడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే రూ. 500 నోటు ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తూ వుండేది. చిన్న, పెద్ద కొనుగోళ్ళకు ఉపయోగపడుతూ వుండేది. మరుసటి రోజు ఉదయానికి పాలు, పంచదార వంటివి కొనుక్కోడానికీ చేతిలో డబ్బులేని పరిస్థితి తలెత్తింది. పాత నోట్లు ఇచ్చి చెల్లే కరెన్సీని పొందడానికి 9వ తేదీ ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా బ్యాంకుల వద్ద కిలోమీటర్ల పొడవున క్యూలు ఏర్పడ్డాయి. అందులో గంటల తరబడి నిలబడలేక కనీసం వంద మంది చనిపోయి వుంటారు. చేతిలో డబ్బులేక లక్షలాది చిన్న వ్యాపారాలు మూతబడ్డాయి.

అనేక లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోనీ ప్రధాని చెప్పినట్టు గుప్త ధనం బయట పడిందా అంటే అదీ లేదు. నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ. 15.41 లక్షల కోట్ల మేరకు ఈ రెండు రకాల పెద్ద నోట్లు వుండగా, రూ. 15.31 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి చేరుకొన్నాయి. దాదాపు మొత్తం గుప్త ధనం చట్టబద్ధ కరెన్సీగా మారిపోయింది. ఆ విధంగా పెద్ద నోట్ల రద్దు గుప్త ధనికుల నెత్తి మీద పాలు పోసింది. పెద్ద నోట్ల రద్దు దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిందే తప్ప గుప్త ధన నిర్మూలనలో దారుణంగా విఫలమైంది. రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు గుప్త ధనం చట్టబద్ధ డబ్బుగా మారిపోయిందని రూఢి సమాచారం. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2017 జనవరి నుంచి ఏప్రిల్ వరకు దేశంలో ఉద్యోగాలు 42% నుంచి 41 శాతానికి పడిపోయాయి. ఆ 4 మాసాల కాలంలోనే 90 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కేవలం నగదు మీద నడిచే చిన్న చిన్న వ్యాపారాలు మూతపడడమంటే గుప్పెడంత బతుకుల గుండెల్లో గునపాలు దిగడమే. నిత్యం అదానీలు, అంబానీలలోనే దేశ ఆర్థిక వ్యవస్థను దర్శించే ప్రధాని మోడీకి వీరి బాధలు పట్టకపోయి వుండవచ్చు.

కాని దేశ జనాభాలో అత్యధిక శాతంగా వున్న ఈ అలగా జనమే జాతికి జవసత్వాలు కదా! నోట్ల రద్దు తీసిన దెబ్బను తట్టుకోడం పెద్ద వ్యాపారాలకు సాధ్యమైంది గాని, చిన్న వ్యాపారాలకు అది ప్రాణగండంగానే నిరూపించుకొన్నది. పెద్ద నోట్ల రద్దుతో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో చిన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. తోలు శుద్ధి కర్మాగారాలు సహా మొత్తం 8000 పరిశ్రమలకు తాళాలు పడ్డాయి. 2000 ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు, 3000 దుస్తుల దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఇవి అతి చిన్న ఆవరణల్లో నడిచేవి. అంటే పెద్ద నోట్ల రద్దు కాకులను కొట్టి గద్దలకు వేసిందని స్పష్టపడుతున్నది. 20172019 మధ్య దేశంలోని పని చేసే వయసు జనాభా 32 మిలియన్లు పెరిగిందని, వారికి 13 మిలియన్ల కొత్త ఉద్యోగాలు కల్పించవలసి వుండగా, 6.7 మిలియన్ ఉద్యోగాలను భారత దేశం కోల్పోయిందని ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల అంచనా నివేదిక వెల్లడించింది.

నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే కోల్పోయిన 95 లక్షల ఉద్యోగాలకు ఇది అదనమని ఆ నివేదిక తెలియజేసింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయం పట్ల పేదలు కృతజ్ఞులుగా వున్నారని మాన్య ప్రధాని మోడీ ఎలా ప్రకటించారో ఎవరికీ అర్థం కాని విషయం. అవినీతిని సహించబోనని ఆయన చేసిన గర్జన కూడా దేశమంతటా మార్మోగదు. ఎందుకంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి గురించి ఆయన వద్ద గల ఇడి, ఐటి, సిబిఐ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎల్లప్పుడూ మౌనాన్నే పాటిస్తూ వుంటాయి. కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే అవినీతిని ఏరివేసే విన్యాసాలకు అవి పాల్పడుతూ వుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News