సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏడు దశలలో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన అనంతరం ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిగగా వరుస ట్వీట్లు చేశారు. గత పదేళ్లలో తన ప్రభుత్వ హయాంలో దేశం అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఆయన తెలిపారు. సుపరిపాలన, వివిధ రంగాలలో సాధించిన ప్రగతి ప్రాతిపదకన అధికార కూటమి ప్రజల వద్దకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ వచ్చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ఇసి ప్రకటించింది.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎన్నికల కోసం పూర్తి సన్నద్ధతతో ఉంది అంటూ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్(మరోసారి మోడీ ప్రభుత్వం) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ఎన్నికలలో గెలుపుపై పూర్తి విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ తన మూడవ దఫా పాలనలో పేదరికం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని, సామాజిక న్యాయం కోసం తన పట్టుదల మరింత బలపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సింది చాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి దశాబ్దమంతా గడచిన 70 ఏళ్లలో గత పాలకులు సృష్టించిన గుంతలను పూడ్చడంతోనే సరిపోయిందని ఆయన తెలిపారు. భారతదేశం కూడా సుసంపన్నంగా, స్వావలంబన సాధించగలదన్న స్ఫూర్తిని నింపగటిగామని, ఇదే స్ఫూర్తితో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు. భారత్‌ను ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా తయారు చేయడానికి కృషి చేయనున్నామని,
యువజనుల స్వప్నాల సాకారానికి మరింతగా పాటుపడతామని ఆయన తెలిపారు. పదేళ్ల క్రితం బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు దేశ ప్రజలు నమ్మకద్రోహానికి గురై నిస్పృహలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘనత ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకే దక్కుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కుంభకోణాలు, అస్తవ్యస్త విధానాలు లేని రంగమంటూ మిగలలేదని, భారత్ పట్ల ప్రపంచం ఆశలు వదిలేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడి నుంచి భారత్‌కు అద్భుతమైన మలుపు మొదలైందని ఆయన తెలిపారు. తమను దూషించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప ప్రతిపక్షాలకు మరేమీ చేతకాదని ఆయన విమర్శించారు. వారి వారసత్వ రాజకీయాలు, సమాజాన్ని చీల్చే ప్రయత్నాలను తాము అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అవినీతి చరిత్రే వారి పాలిట శాపంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదని ఆయన తెలిపారు.
140 కోట్ల జనాభా శక్తితో అభివృద్ధిలో కొత్త చరిత్రను భారత్ సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో దేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారని మోడీ తెలిపారు. తమ పథకాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం చేరాయని ఆయన తెలిపారు. అంకిత భావం, లక్ష్యాలను సాధించాలన్న పట్టుదల ఉన్న ప్రభుత్వం ఎటువంటి ఫలితాలు సాధించగలదో ప్రజలు చూస్తున్నారని, ఈ ప్రభుత్వం నుంచి మరిన్ని ఫలితాలను వారు ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కారణంగానే దేశనలుమూలల నుంచి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అప్ కీ బార్,400 పార్(ఈ సారి 400కి మించి) అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని మోడీ తెలిపారు. ప్రజలు.. ముఖ్యంగా పేదలు, రైతులు, యువత, మహిళల ఆశీస్సుల నుంచి తాను గొప్ప శక్తిని పొందుతానని ఆయన తెలిపారు.
తాము మోడీ కుటుంబమని ప్రజలు చెప్పినపుడు తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని, దేశాభివృద్ధి కోసం మరింత కష్టపడాలన్న సంకల్పం తనలో మరింత పెరుగుతుందని ఆయన తలిపారు. మనమంతా కలసికట్టుగా ఇందుకోసం కృషి చేద్దామని పేర్కొంటూ యహీ సమయ్ హై, సహీ సమయ్ హై(ఇదే సరైన సమయం) అన్న తన నినాదాన్ని మోడీ పునరుద్ఘాటించారు.