పుణె : దేశం లోని ప్రభుత్వ విధానాల్లో, కష్టించే ప్రజల్లో పూర్తి విశ్వాసం కనిపిస్తోందని, పరస్పర విశ్వాసం లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసించే దేశాల్లో భారత్ ఉందని అంతర్జాతీయ సర్వేలో తేలిందని మోడీ ఉదహరించారు. అపనమ్మకం నుంచి పూర్తి నమ్మకం వైపు భారత్ పయనిస్తోందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు తిలక్ 103 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు.
తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాన్ని అందించింది. ఈమెమెంటోతోపాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీని బహూకరించగా, దానిని నమామి గంగ ప్రాజెక్టుకు మోడీ అందజేశారు. ఈ జాతీయ పురస్కారం స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత దేశ ప్రజలు ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, ప్రపంచంలోనే ఐదో భారీ ఆర్థికాభివృద్ధి దేశంగా భారత్ అభివృద్ధి చెందిందని వివరించారు. పత్రికా స్వాతంత్య్రం ప్రాధాన్యతను లోకమాన్యతిలక్ బాగా అర్ధం చేసుకున్నారని, స్వాతంత్య్ర పోరాట దిశను తిలక్ మార్చేశారని, భారత దేశంలో అశాంతికి పిత తిలక్ అని ఆనాడు బ్రిటిష్ వారు ముద్రవేశారని, కానీ ఈరోజు ఆయన మార్గాన్ని ప్రతిదానిలోనూ నమ్ముతున్నారని మోడీ చెప్పారు. తిలక్ ఘనతను గుర్తించి ప్రజలే ఆయనకు లోకమాన్య బిరుదు ఇచ్చారన్నారు.
తిలక్ జీవితం నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయన్నారు. యువత సత్తాను గుర్తించే ప్రతిభ తిలక్‌కు ఉందన్నారు. అందుకే వీరసావర్కర్ సత్తాను గుర్తించారన్నారు. భగవద్గీతపై తిలక్‌కు గొప్పనమ్మకం ఉందని, మాండలే జైలుకు బ్రిటిష్ వారు తిలక్‌ను పంపగా, అక్కడ కూడా భగవద్గీతపై పరిశోధనలు సాగించి గీతా రహస్యాన్ని రచించారని, ప్రజలకు కర్మ శక్తిని తెలియజేశారని మోడీ అభివర్ణించారు. ఈ వేదికపై ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్ కూడా పాల్గొనడం విశేషం. శరద్‌పవార్ మాట్లాడుతూ దేశంలో తొలి సర్జికల్ స్ట్రైక్ ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామంలో రెండు శకాలు ఉన్నాయని, ఒకటి తిలక్, రెండోది మహాత్మా గాంధీ అని తెలిపారు. పవార్‌తోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సిఎం ఫడ్నవీస్, అజిత్ పవార్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.