భారత, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రకు గుర్తింపుగా ఆయనను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె శనివారం‘మిత్ర విభూషణ’ పురస్కారంతో సత్కరించారు. ద్వీప దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్స ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు ఆ అవార్డు గ్రహీతల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్, దివంగత పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్ కూడా ఉన్నారు. ‘అధ్యక్షుడు దిసనాయకె ద్వారా శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు అందుకోవడం నాకు గౌరవప్రదం. అది 140 కోట్ల మంది భారతీయులకు కూడా గౌరవప్రదం’ అని మోడీ స్పందించారు.
కొలంబోలో అధ్యక్ష సచివాలయంలో ఒక వేడుకలో మోడీకి దిసనాయకె ఆ అవార్డు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతకు ఒక ప్రశంసాపత్రం, శ్రీలంక నవరత్నాలు, కమలం, గ్లోబ్, సూర్య చంద్రులు, వరి కంకుల చిహ్నాలు పొదిగిన రజత పతకాన్ని అందజేశారు. పతకంపై గల ధర్మ చక్రం రెండు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలను తీర్చిదిద్దిన బౌద్ధ వారసత్వ సంపదకు ప్రతీక. వరి కంకులు చిత్రించిన ‘పున్ కలశం’సంపదకు ప్రతీక అని అధికారి ఒకరు పేర్కొన్నారు. కమలం రేకుల మధ్యలో గ్లోబ్‌లో నవరత్నాలను పొదిగారు. బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన తరువాత బ్యాంకాక్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం కొలంబో చేరుకున్నారు.