Sunday, January 19, 2025

దేశంలో పులుల సంఖ్య పెరిగింది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

2006లో 1,411గా ఉన్న పులులు 2022 నాటికి 3,167కు వృద్ధి

ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవంలో
పులుల గణాంకాలను విడుదల చేసిన ప్రధాని మోడీ

మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం కర్నాటకలోని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ గణాంకాలను విడుదల చేశారు. 2006లో 1,411 పులులు ఉండగా , 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967 పులులు ఉండేవని తెలిపారు. 2006తో పోలిస్తే పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా మోడీ విడుదల చేశారు. చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, ప్యూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడురకాల బిగ్ క్యాట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయెన్స్‌ను మోడీ ప్రారంభించారు. ఈ కూటమిలో దాదాపు 97 దేశాలున్నాయి. వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించి పోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టిపెడుతుంది.ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగ్గ చర్యలను నిర్ణయిస్తుంది. నిధులను కూడా సమకూరుస్తుంది.

పులుల అభయారణ్యాలు 2006లో 28 ఉండేవని, ఇప్పుడు వీటి సంఖ్య 51కి పెరిగిందని ప్రధాని తెలిపారు. మన దేశంలో పులుల సంరక్షణ కోసం పటిష్టమైన విధానాలను అమలు చేస్తున్నామని, అందువల్ల దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య 63 శాతం పెరిగిందని చెప్పారు. 2014లో 7,910 చిరుత పులులు ఉండేవని, 2018 నాటికి వీటి సంఖ్య 12,852కు చేరుకుందని తెలిపారు. చీతాలు అంతరించిపోకుండా కాపాడడం కోసం 2022లో నమీబియా, దక్షిణాఫ్రికాలనుంచి చీతాలను మన దేశానికి తీసుకు వచ్చినట్లు చెప్పారు.

విధంగా ట్రాన్స్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ జరగడం ప్రపంచంలోనే మొట్టమొదటిదని ఆయన చెప్పారు. ‘ ప్రాజెక్ట్ టైగర్ ’ విజయవంతం కావడం మన దేశానికే కాకుండా ప్రపంచానికే గర్వకారణమని మోడీ అన్నారు. ప్రపంచ భూభాగంలో భార దేశం వాటా 2.4 శాతమని ప్రధాని మోడీ గుర్తు చేశారు. కానీ ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం వాటా మన దేశానిదేనని ఆయన అన్నారు. దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు కలిగిన దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. ప్రకృతిని సంరక్షించడం భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఆ శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News