గాంధీనగర్ : మహిళ పురోగమిస్తేనే ప్రపంచం పురోగమిస్తుందని, ఈ దిశలో మహిళా కేంద్రీకృత ప్రగతి దృక్ఫథం అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మహిళా సాధికారికత కేవలం నినాదాలతో సరిపోదని, దీనికి తగు విధమైన కార్యాచరణ అవసరం అన్నారు. బుధవారం ప్రధాని మోడీ గుజరాత్ రాజధానిలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ మినిస్టిరియల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ప్రసంగించారు. జి20కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు ఏర్పాటు అయింది. మహిళలకు సరైన సాధికారికతను ఇవ్వడం వల్ల కేవలం వీరిని ఆదరించినట్లే అవుతుందని అనుకోరాదని, దీని వల్ల సకల ప్రగతికి దారితీస్తుందన్నారు. మహిళలకు పెద్దపీట వేసి చేపట్టే అభివృద్థితోనే వారి అభ్యున్నతి పనిలో పనిగా సర్వతోముఖాభివృద్ధికి వీలేర్పడుతుందని తెలిపారు. ఇప్పుడు మహిళ మునుపటిలాగా వెనుకబడిలేదు.
అన్ని రంగాలలో తన ప్రాధాన్యతను చాటుకొంటోంది. ఈ దశలో మహిళా పారిశ్రామికవేత్తకు సరైన స్థాయి పాత్రను కల్పించాల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. ఇదే మన లక్షం కావాలని తెలిపారు. సత్తాను చాటుకునే దశకు మహిళలు చేరినప్పుడు , ఈ అవకాశం కల్పించడం వారితో పాటు అందరికీ ప్రయోజనం కల్గిస్తుందన్నారు. ఏ రంగంలో అయినా మహిళ పాత్ర సానుకూలతను తెచ్చిపెడుతుంది.ఈ విధంగా పాజిటివ్ సంకేతాలు వెలువడుతాయి. వారి నాయకత్వ లక్షణం పూర్తిగా సమ్మిశ్రితం అవుతుంది. వారి బాణి, వారి చర్యలు సముచిత మార్పులకు దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు. తిరుగులేని మన మహిళాశక్తికి ప్రధమ పౌరురాలు , రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రతీక అవుతారు. వారిది అత్యంత సాధారణ గిరిజన నేపథ్య కుటుంబ జీవనం.
ఇప్పుడు ఆమె తమ స్వశక్తితో దేశంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగ అధినేత్రిగా నిలిచారని ప్రధాని తెలిపారు. దేశంలో ఆది నుంచి మహిళలకు ఓటేసే హక్కు, పోటీ చేసే హక్కు కల్పించడం జరిగిందన్నారు. ఇక గ్రామీణ స్థానిక సంస్థలలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులలో మహిళలు 46 వాతం దాకా ఉన్నారని, వీరి సంఖ్య కోటి నలభై లక్షలు అని వివరించారు.