తిరువనంతపురం: భారత్ తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్‌యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అని మోడీ తిరువనంతపురం సమీపంలోని తుంబాలో విక్రమ్ సారాభాయ్ రోదసి కేంద్రం (విఎస్‌ఎస్‌సి)లో వెల్లడించారు. ప్రధాని మోడీ వారికి ‘వ్యోమగామి వింగ్స్’ అందజేస్తూ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను పరిపూర్తి చేసే నాలుగు శక్తులు అని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనంతరం ఒక భారతీయుడు రోదసిలోకి ప్రవేశించబోతున్నట్లు మోడీ చెప్పారు.
‘ఈ పర్యాయం కౌంట్‌డౌన్, సమయం, చివరకు రాకెట్ కూడా మనదే’ అని ప్రధాని తెలిపారు. గగన్‌యాన్ మానవ సహిత రోదసి యాత్రలో ఉపయోగిస్తున్న విడి భాగాలలో చాలా వరకు భారత్‌లో తయారైనందుకు తాను గర్విస్తున్నానని, ఆనందిస్తున్నానని ప్రధాని తెలియజేశారు. భారత రోదసి కార్యక్రమంలో మహిళలు పోషించిన ‘ముఖ్య పాత్ర’ ఎటువంటిదో కూడా ప్రధాని వివరించారు.
చంద్రయాన్, గగన్‌యాన్ వంటి రోదసి యాత్రలు మహిళల కృషి, భాగస్వామ్యం లేకుండా సాధ్యం కావని మోడీ స్పష్టం చేశారు. రోదసి రంగంలో భారత్ విజయం దేశంలోని యువ తరంలో వైజ్ఞానిక భావనను పాదుకొల్పడమే కాకుండా వివిధ రంగాలలో సాధించిన గణనీయమైన పురోభివృద్ధిని చాటడం ద్వారా 21వ శతాబ్దంలో పటిష్ఠ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించేందుకు దోహదం చేస్తున్నదని మోడీ చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో మూడు ప్రధాన సాంకేతిక విభాగాల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోడీ విఎస్‌ఎస్‌సికి వచ్చారు.