Wednesday, January 22, 2025

వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్‌మెన్: కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఇప్పుడు అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్రికెట్‌తో ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ తమను తామే రనౌట్ చేసుకునే క్రికెట్ జట్టులాంటిదని,ఆ పార్టీ బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు రనౌట్ చేసుకోవడానికి అయిదేళ్లు ప్రయత్నించారని మోడీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లోని చురు జిల్లా తారానగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే ఈ నెల 25న జరిగే ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలని ఆయన ప్రజలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య అధికారం కోసం జరుగుతున్న పోరును ప్రధాని ప్రస్తావిస్తూ‘ క్రికెట్‌లో ఒక బ్యాటర్ వచ్చి తన జట్టు కోసం పరుగులు చేస్తాడు. అయితే కాంగ్రెస్‌లో మాత్రం బోలెడంత అంతర్గత పోరు ఉంది.ఎంతంటే పరుగులు చేయడానికి బదులు ఆ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేయడానికి అయిదేళ్లు గడిపారు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ , అభివృద్ధి పరస్పర శత్రువులని మోడీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉండే సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉండే సంబంధం లాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ మాఫియా లక్షల రూపాయల కోసం యువకుల భవిష్యత్తుతో ఆడుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కుంభకోణానికి పాల్పడిందని, రైతులను దోచుకుందని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక పేపర్ లీక్ కుంభకోణంపై వేగంగా దర్యాప్తు జరిపిస్తుందని ప్రధాని చెప్పారు. ఎంతగొప్పవాళ్లనయినా వదిలిపెట్టబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఝున్‌ఝున్‌లో జరిగిన మరో సభలో ప్రధాని మాట్లాడుతూ అన్ని రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోందని, అన్ని రంగాల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోందని అంటూ , 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తామన్న విశ్వాసం ఉందని చెప్పారు. రాజస్థాన్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని మోడీ జోస్యం చెప్పారు. రాజస్థాన్‌లో అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలు,దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News