న్యూఢిల్లీ: “కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశం పేదల సంక్షేమం. ఈ కేంద్ర బడ్జెట్ పెట్టుబడులకు, మౌలిక వసతుల కల్పనకు, ఉద్యోగకల్పనకు అవకాశం ఇవ్వనుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. “ ఇది ప్రగతిశీల, ప్రజానుకూల బడ్జెట్ ” అని కూడా ఆయన శ్లాఘించారు. ఆయన కొవిడ్19 మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ గత 100 ఏళ్లలో అత్యంత ప్రమాదకారి అయిన ఈ మహమ్మారి కాలంలో కూడా ఈ బడ్జెట్ అభివృద్ధిదాయకం కానుందన్నారు. కేంద్ర బడ్జెట్ 202223పై మోడీ టెలివిజన్ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతనావకాశాలను కల్పించడమేకాక, ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుందని కూడా మోడీ అభిప్రాయపడ్డారు.
“ ఈ బడ్జెట్ మరింత మౌలిక వసతుల కల్పనను, మరింత పెట్టుబడిని, మరింత వృద్ధిని, మరిన్ని ఉద్యోగాల కల్పనను అందించగలదు” అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ గ్రీన్ జాబ్స్ రంగానికి శ్రీకారం చుట్టగలదన్నారు. “ ఈ బడ్జెట్ ముఖ్యాంశం పేదల సంక్షేమానికి తోడ్పడగలదు” అని కూడా ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 39.45 లక్షల కోట్ల అతి పెద్ద బడ్జెట్‌ను మంగళవారం ఆవిష్కరించారు. హైవేలు, అందుబాటు ధరలో ఇళ్లకు ఈ బడ్జెట్ ఊతం ఇవ్వనుందని ఆమె అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ బడ్జెట్ ఆర్థిక పునరుజ్జీవాన్ని కల్పించగలదన్నారు. మౌలికవసతుల కల్పన ఉపాధిని సృష్టించగలదని, ఆర్థిక కార్యకలాపానికి ఊతం ఇవ్వనుందని నిర్మలాసీతారామన్ అభిప్రాయపడ్డారు. అయితే ఆమె ఆదాయపు శ్లాబులు, పన్ను రేట్లను ప్రస్తావించలేదు.