Monday, December 23, 2024

రాజద్రోహ చట్టానికి మోడీ అండ?

- Advertisement -
- Advertisement -

PM Modi says Committee on repeal of Sedition Law

రాజద్రోహ చట్టం (భారతీయ శిక్షాస్మృతి 124ఎ) రద్దుకు తొందరపడవద్దని దానిపై తానే ఒక కమిటీని నియమించదలచానని సుప్రీంకోర్టుకు తెలియజేయడంలో ప్రధాని మోడీ ప్రభుత్వ ఆంతర్యం ప్రజాస్వామ్య హక్కులను మరింతగా కాలరాయడమేనని స్పష్టపడుతున్నది. ప్రధాని మోడీ స్వయంగా కలుగజేసుకొని సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాయించారని వార్తలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నను ఉరి తీయడం ఎంత మాత్రం సబబు కాదు. రాజకీయ ప్రత్యర్థులో, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నవారో పాలకుల దమనకాండను ఎదుర్కొనే క్రమంలో వేసే ప్రశ్నలను, చెప్పే అభ్యంతరాలను రాజద్రోహంగా పరిగణించడం ఎంత మాత్రం ప్రజాస్వామికం కాదు. అందుకే తమ సామ్రాజ్య పాలన హయాంలో తాము తీసుకు వచ్చిన రాజద్రోహ చట్టాన్ని బ్రిటిష్ పాలకులు 2009లోనే రద్దు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ వుండదగినది కాదని భావించిన రోజుల్లో తీసుకు వచ్చిన ఆ చట్టాన్ని ఎంత మాత్రం కొనసాగించరాదని భావించి దానికి తలకొరివి పెట్టారు. వారి సామ్రాజ్యంలో భాగంగా నానా కష్టాలు పడిన భారత దేశంలో మాత్రం ఈ చట్టం ఇంకా కొనసాగుతుండడం కంటే సిగ్గు పడవలసిన విషయం మరొకటి వుంటుందా! రాజులే లేని చోట రాజద్రోహం ఎక్కడ వుంటుంది, దాని పేరుతో పౌరులను శిక్షించడం ఎంత వరకు సబబు? భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల (75 ఏళ్లు) సందర్భంగా బ్రిటిష్ వలస పాలకుల నిరంకుశ చట్టాలను వదిలించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజద్రోహ చట్టం తరచూ దుర్వినియోగమవుతున్నదని, అది ప్రజాస్వామిక హక్కులకు గుదిబండగా మారిందని భావించిన సుప్రీంకోర్టు దీనిని పూర్తిగా రద్దు చేయాలని సంకల్పించింది. మాటలు, చేతలు, సంకేతాలు, ప్రాతినిధ్యం ద్వారానో, ఇతరత్రానో చట్టబద్ధ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేసే వారికి గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష లేదా జుర్మానా లేదా ఆ రెండింటిని గాని, కనీస పక్షం మూడేళ్ల శిక్ష లేదా జుర్మానా లేదా ఆ రెండింటిని గాని వేయవచ్చని భారత శిక్షాస్మృతి 124-ఎ చెబుతున్నది. దీనినే రాజద్రోహ చట్టంగా భావిస్తున్నాము. ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1870లో శిక్షాస్మృతిలో చేర్చింది. ప్రజాస్వామ్యంలో దీని అవసరం తీరిపోయిన దృష్టా పూర్తిగా రద్దు చేసే విషయంపై సుప్రీంకోర్టు గత ఏడాది దృష్టి సారించింది. ఆ మేరకు ఈ చట్టం రద్దును కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అమృతోత్సవాలను పురస్కరించుకొని సామ్రాజ్యవాద చట్టాలను వదిలించుకోడం సబబని భావించినట్టు ప్రచారం జరిగిన ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా ఇందుకు సంపూర్ణ సహకారం ఇస్తుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశ కలిగిస్తూ అది సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ చట్టం రద్దుకు తొందరపడవద్దని కేంద్రం అందులో సుప్రీంకోర్టును కోరింది. రాజకీయ ప్రత్యర్థులను, ప్రశ్నించేవారిని శిక్షించదలచుకుంటే అనేక మార్గాలుండగా ప్రధాని మోడీ ప్రభుత్వం రాజద్రోహ నిబంధనను ఎందుకు కొనసాగించదలచుకుంటున్నదో ఊహించలేనిది కాదు. ప్రత్యర్థులను అప్రజాస్వామికంగా అణచివేయడానికి అన్ని రకాల శాసన ఆయుధాలనూ చేతిలో వుంచుకోవాలని అది ఆశిస్తున్నది. 1962లో కేదార్‌నాథ్ సింగ్, కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం అవసరాన్ని ధ్రువపరిచింది. దానిని ఆసరా చేసుకొని ప్రభుత్వాలు దీని దుర్వినియోగానికి తరచూ తెగబడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు మహోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బెర్గ్‌కు సంబంధించిన టూల్ కిట్ కేసులో బెంగళూరులోని 22 ఏళ్ల దిశరవి అనే విద్యార్థినిని కేంద్ర పోలీసులు ఈ చట్టం కింద అరెస్టు చేసి తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈ చట్టం దుర్వినియోగం విపరీత స్థాయికి చేరుకున్నదని గణాంకాలు చెబుతున్నాయి. తమ పిల్లలను తామే తినేసే క్రూర మృగాల మాదిరిగా చట్టబద్ధ, న్యాయబద్ధ పాలనను కోరుకునే తమ ప్రజలను అరెస్టులతో, దీర్ఘకాల నిర్బంధాలతో భయపెట్టే ప్రభుత్వాలను ప్రజాస్వామిక ప్రభుత్వాలని ఎంత మాత్రం అనుకోలేము. అంతటా, అందరూ వ్యతిరేకిస్తున్న రాజద్రోహ సెక్షన్‌ను తొలగించవద్దని సుప్రీంకోర్టును కోరుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వం బొత్తిగా ప్రజాస్వామికమైనది కాదని ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కేదార్ నాథ్ సింగ్ కేసులో రాజద్రోహ చట్టం కొనసాగాలని చెప్పిన రాజ్యాంగ ధర్మాసనమే కేవలం ప్రశ్నించడాన్ని, మాటలతో విమర్శించడాన్ని రాజద్రోహంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. 2021 జూన్‌లో ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువాపై హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మోపిన రాజద్రోహ నేరారోపణను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అటువంటప్పుడు ఈ చట్టాన్ని తొలగించడానికి ఏ ప్రజాస్వామిక ప్రభుత్వానికైనా ఎటువంటి అభ్యంతరం వుండనక్కర లేదు.

PM Modi says Committee on repeal of Sedition Law

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News