న్యూఢిల్లీ: కాశీ విశ్వనాథుని ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోకి చర్మంతో చేసిన చెప్పులు లేదా రబ్బర్ చెప్పులు ధరించడం నిషిద్ధం కావడంతో అక్కడ విధులు నిర్వహించే పూజారులు,సేవకులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, ఇతర సిబ్బంది చెప్పులు ధరించకుండా రిక్త పాదాలతో పనిచేస్తున్నట్లు తన దృష్టికి రావడంతో స్పందించిన ప్రధాని మోడీ వారికి జనపనారతో తయారు చేసిన 100 జతల పాదరక్షలను పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి. శీతాకాలంలో గడ్డకట్టే చలిలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పనిచేస్తున్న ఆలయ సిబ్బందికి ఇక ఆ సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ వారి కోసం ప్రత్యేకంగా జనపనారతో తయారుచేసిన పాదరక్షలను సేకరించారు. ప్రధాని మోడీ కాశీ విశ్వనాథుని ఆలయానికి సంబంధించిన అన్ని విషయాలలో పూర్తిగా దృష్టి సారించారని, అక్కడ సమస్యలతోపాటు అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలను ఆయన తెలుసుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. అక్కడి సిబ్బందిపై ఆయన చూపుతున్న శ్రద్ధకు ఇదో చక్కని ఉదాహరణగా వర్గాలు అభివర్ణించాయి.