Friday, December 27, 2024

విభజన హామీలపై తెలంగాణ పర్యటనలో మోడీ సమాధానం చెప్పాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో ఈ నెల 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లుగా హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెండు రోజుల నిరస నలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు వరంగల్, హన్మకొండ జిల్లాలలో 7వ తేదీన ఈ నెల 8న బయ్యారం ఉక్కు కర్మాగారం చేపట్టనందుకు కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయనందుకు ములుగు జిల్లాలలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీల అమలుపై ప్రధాని వద్దకు సిఎం కెసిఆర్ అఖిలపక్ష బృందాన్ని తీసుకు వెళ్ళాలని కోరారు. హైదరాబాద్, మగ్దూంభవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా , కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఎన్.బాలమల్లేశ్ కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుండే ఉమ్మడి రాష్ట్రలంలో పోరాటాల ఫలితంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని కూనంనేని గుర్తుచేశారు. అది కాకుండా ఈనెల 8న ప్రధాని వరంగల్ పర్యటలో రైల్వే వ్యాగన్ రిపేరింగ్ ఓవర్ హాలింగ్ ప్లాంట్ శంకుస్థాపన చేయడమేమిటని నిలదీశారు.

అలాగే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని, అక్కడి ఇనుప ఖనిజం నాణ్యమైనదని జియో లాజికల్ సర్వే నివేదిక ఇచ్చిందని, పాల్వంచలో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ సైతం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. కాని తొమ్మిదేళ్ళైనా ఆ జాడ లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఐఐటి, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ వంటి అనేక హామీలు తొమ్మిదేళ్ళైనా అమలు చేయలేదని కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నితి అయోగ్ సిఫార్సులు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఇతర బకాయిలు రూ. 50 వేల కోట్ల వరకు రావాల్సి ఉన్నదని, కాళేశ్వరంకు ఇవ్వనందున పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సి ఉన్నదన్నారు.

తెలంగాణకు అంతిచ్చామని, ఇంతిచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, అసలు విభజన హామీలలో ఏమిచ్చారో ఎంతిచ్చారో రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. సింగరేణి గనులను కూడా ఇష్టానుసారం ప్రైవేటు పరం చేస్తున్నారని, అందుకు నిరసనగా సింగరేణి గనులలో ఈ నెల 8న కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.

తెలంగాణలో మేమే గెలవబోతున్నామని, అధికా రంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు ఊహల పల్లకిలో విహరించారని, మునుగోడు ఉప ఎన్నికలలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కారణంగా రాష్ట్ర బిజెపికి ముల్లబాటగా మారిందని కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడులో బిఆర్‌ఎస్ కాకుండా బిజెపి గెలిచి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికే ప్రమాదం వచ్చేదని, రాష్ట్రం అస్థిరంగా మారేదన్నారు. బిజెపిని కమ్యూనిస్టులు నిలువరించకపోతే ప్రమాదక్ర పరిణామాలు ఉండేవ న్నారు. దాని ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడేదన్నారు.

కర్నాటకలో బిజెపి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, మానసిక ప్రభావం మునుగోడు ఉప ఎన్నిక నుండే పడిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావించిన బిజెపి అకస్మాత్తుగా అధ్యక్షుడిని మార్చిం దని, నరేంద్ర మోడీ, బిజెపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణలో ఆ పార్టీకి స్థావరం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ముక్త్ భారత్ పేరుతో బిజెపి ఆడుతున్న విష క్రీడను మహారాష్ట్రలో చూస్తున్నామని, ఇప్పటికీ శివసేను చీల్చిన బిజెపి, తాజాగా ఎన్‌సిపిని చీల్చిందన్నారు. తెలంగాణలో కూడా జూద క్రీడ లాంటి రాజకీయ క్రీడ ఆడాలని చూస్తున్నారని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని, బిజెపిని నిలవరిం చేందుకు సిఎం కెసిఆర్ తుది వరకు పోరడాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News