బారాబంకి(యుపి): అధికారంలోకి వస్తే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) అయోధ్యలోని రామాలయాన్ని బుల్ డోజర్‌తో కూల్చివేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బుల్ డోజర్లను ఎక్కడ ఎక్కించాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పార్టీలకు ఆయన సూచించారు. శుక్రవారం నాడిక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఒక్కో దశ ఎన్నికలు ము కొద్దీ ప్రతిపక్ష ఇండియా కూటమి పేకముక్కల్లా కూలిపోతోందని, దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.తన ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త రభుత్వంలో పేదలు, యువజనులు, మహిళలు, రైతుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, అందు కోసమే తాను బారాబంకి,
మోహన్‌లాల్ గంజ్ ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని మోడీ తెలిపారు. జూన్ 4వ తేదీకి ఎంతో దూరం లేదని, మోడీ ప్రభుత్వ హ్యాట్రిక్ కొట్టనున్నదని యావత్ దేశానికి తెలుసునని ఆయన చెప్పారు. ఒక వైపున జాతీయ ప్రయోజనాలకు కట్టుబడిన బిజెపి- ఎన్‌డిఎ కూటమి ఉండగా మరో వైపున దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఉంది. ఎన్నికలు జరుగుతున్న కొద్దీ ఈ ఇండియా కూటమి నాయకులు పేక ముక్కల్లా కూలిపోతున్నారు అని ఆయన విమర్శించారు. మీ కోసం పనిచేసే ఎంపీలు మీకు అవసరం. ఐదేళ్ల పాటు మోడీని తిట్టే ఎంపీలు కాకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు మనకు అవసరం. ఇందుకు మీకు కమలం గుర్తు ఒక్కటే ప్రత్యామ్నాయం. మీకు 1000 సిసి ఇంజిన్ కావాలా 100 సిసి ఇంజిన్ కావాలా ?వేగంగా అభివృద్ధి కావాలంటే బలమైన ప్రభుత్వమే అది ఇవ్వగలదు.
బిజెపి ప్రభుత్వం మాత్రమే అది ఇవ్వగలదు అని మోడీ స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్, సమాజ్‌వాది ల విధానాలను ఆయన ప్రస్తావిస్తూ రామాలయం నిష్ప్రయోజనమని ఎస్‌పికి చెందిన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారని మోడీ తెలిపారు. అదే సమయంలో రామాలయంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. ఆ రెండు పార్టీలకు వారి కుటుంబాలు, అధికారం మాత్రమే కావాలని ఆయన దుయ్యబట్టారు. ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే బాల రాముడి బిగ్రహాన్ని మళ్లీ టెంటులోకి పంపి రామాలయాన్ని కూల్చివేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఆయన విమర్శించారు. తాను ఆ విషయాన్ని బయటపెడితే తనను దూషించడం మొదలు పెడతారని మోడీ తెలిపారు. ఆ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు లొంగిపోయాయని ఆయన ఆరోపించారు. ఈ వాస్తవాన్ని తాను దేశానికి వెల్లడిస్తే మోడీ హిందూ-ముస్లిం చీలికను తెస్తున్నారని ఆరోపిసుత్నారని ఆయన తెలిపారు. ఈ పార్టీలు వెంటపడుతున్న ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు వాస్తవాన్ని గ్రహిస్తోందని ఆయన చెప్పారు.
ట్రిపుల్ తలాఖ్‌పై తెచ్చిన చట్టంతో మన తల్లులు, సోదరీమణులు కూడా సంతోషంగా ఉన్నారని, వారు కూడా బిజెపిని దీవిస్తున్నారని మోడీ తెలిపారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ధ్వజమెత్తుతూ ఈ సోషలిస్టు యువరాజు ఇప్పుడు కొత్త మేనత్త పంచన చేరారని మోడీ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ కొత్త మేనత్త బెంగాల్‌లో ఉంటారని, మీకు వెలుపలి నుంచి మద్దతు ఇస్తానని ఈ మేనత్త ఇండియా కూటమికి చెప్రారని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో బిఎస్‌పి అధినేత్రి మాయావతిని కూడా మేనత్త అని అఖిలేష్ సంబోధించేవారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆప్, కాంగ్రెస్ మధ్య పంజాబ్‌లో ఏర్పడిన విభేదాలను ప్రస్తావిస్తూ పంజాబ్‌లో ఒకరినొకరం తిట్టుకోవద్దని ఆ రెండు పార్టీలు పరస్పరం చెప్పుకున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి పదవిని దక్కించుకోవాలని అవి పగటి కలలు కంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దేశ ప్రధాన మంత్రిని రాయబరేలి ప్రజలు ఎన్నుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను మోడీ ఎద్దేవా చేస్తూ వారి పగటి కలలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు.
ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై తన విమర్శలను గురిపెడుతూ..అనారోగ్యం సాకుతో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన బీహార్‌కు చెందిన పశు దాణా కుంభకోణం సృష్టికర్త కూడా ముస్లింలకే మొత్తం రిజర్వేషన్లు ఇచ్చేయాలని అంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. అంటే దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు ఇక రిజర్వేషన్లు ఏవీ దక్కవని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని రూపొందించినపుడు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాని నిర్ణయించారని ఆయన వివరించారు. అయితే పదేళ్ల క్రితం వీరంతా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించారని, ఈ పని కర్నాటకలో ఇప్పటికే చేశారని, రాత్రికిరాత్రే ముస్లింలను ఓబిసిలుగా మార్చివేశారని మోడీ అన్నారు. ఓబిసిలకు కల్పించిన రిజర్వేషన్లలో భారీ వాటాను లూటీ చేశారని ఆయన ఆరోపించారు. రామ కార్యం పూర్తియ్యిందని, ఇప్పుడు జాతి కార్యం మిగిలి ఉందని మోడీ తెలిపారు. మీ హక్కులను పరిరక్షించేందుకే 400కు మించి సీట్లు ఇవ్వాలని కోరుతున్నానని ఆయన ప్రకటించారు. ఐదవ దశ ఎన్నికలలో భాగంగా మే 20న బారాబంకిలో పోలింగ్ జరగనున్నది.