కాంగ్రెస్ రాష్ట్రాలు పార్టీ ‘షాహి పరివార్’కు ఎటిఎం
ఎంవిఎ అవినీతికి ప్రతీక
ఎన్నికల్లో విజయానికి ఆ పార్టీ భారీగా అవినీతికి పాల్పడుతుంది
మహారాష్ట్రను కాంగ్రెస్ ఎటిఎంను కానివ్వం
అకోలాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ
అకోలా : ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఆ రాష్ట్రం పార్టీ ‘షాహీ పరివార్’కు ఎటిఎంగా మారుతుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆరోపించారు. ఈ నెల 20 నాటి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అకోలాలో ఒక ప్రచారం ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎటిఎం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అంత ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నప్పుడు అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎంత అవినీతిమయంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చునని ప్రధాని అన్నారు. ‘కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ రాష్ట్రం పార్టీ షాహి పరివార్‌కు ఎటిఎంగా మారిపోతుంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం (కాంగ్రెస్ పాలిత) కర్నాటకలోని మద్యం వ్యాపారుల నుంచి రూ. 700 కోట్లు బలవంతంగా వసూలు చేశారు.
తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కూడా ఆ షాహీ పరివార్ ఎటిఎంలుగా మారాయి’ అని మోడీ ఆరోపించారు. (మహారాష్ట్రలోని అధికార కూటమి) మహాయుతి మహిళల భద్రత, ఉద్యోగావకాశాలు, లడ్కీ బహిన్ యోజన విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తుండగా, కాంగ్రెస్, శివసేన (యుబిటి), శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సిపి (ఎస్‌పి)తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ‘అవినీతి పత్రం’తో వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘ఎంవిఎ అంటే అవినీతి, టోకెన్ డబ్బు, బదలీ నియామక వ్యాపారం అనేదని మొత్తం దేశానికి తెలుసు’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ను ప్రధాని మరింతగా తూర్పారపడుతూ, పార్టీ షాహీ పరివార్ ఎన్నడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ‘పంచ్‌తీర్థ్’ను సందర్శించారా అని తాను సవాల్ చేస్తున్నానని చెప్పారు.
మధ్య ప్రదేశ్‌లోని మ్హౌలోని అంబేద్కర్ జన్మస్థలం, యుకెలో ఆయన చదువుకున్నప్పుడు లండన్‌లో ఆయన బస చేసిన ప్రదేశం, నాగ్‌పూర్‌లో ఆయన బౌద్ధమతం స్వీకరించిన దీక్ష భూమి, ఢిల్లీలోని ఆయన ‘మహాపరినిర్వాణ్ స్థల్’, ముంబయిలోని ‘చైత్య భూమి’ని ఉద్దేశించి మోడీ ‘పంచ్‌తీర్థ్’ పదం ప్రస్తావించారు. ‘బాబాసాహెబ్ దళితుడు కనుక, రాజ్యాంగం రూపకల్పన ఘనత ఆయనకు దక్కినందున ఆయనను వారు ద్వేషిస్తారు. బాబాసాహెబ్ నాకు, బిజెపి, నా ప్రభుత్వానికి ఒక స్ఫూర్తిదాత. ఆయన వారసత్వ సంపదకు సంబంధించిన ప్రదేశాలను మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మా యుపిఐకి భీమ్ యుపిఐ అని నామకరణం చేశాను’ అని మోడీ తెలియజేశారు. కులాలు, మతాలను పరస్పరం వైరి వర్గాలుగా మార్చడం, దళితులు, వెనుకబడిన వర్గాలు సమైక్యం కాకుండా నిరోధించడం కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అని, అయితే, ‘ఏక్ హై తో సేఫ్ హై’ (మనం ఐక్యమైతే భద్రంతా ఉంటాం) అనే మంత్రాన్ని అనుసరించి హర్యానా ప్రజలు ఆ కుట్రను భగ్నం చేశారని మోడీ అన్నారు.
దేశం దుర్బలంగా ఉంటేనే తాను పటిష్ఠం కాగలనని కాంగ్రెస్‌కు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండు విడతలలో తన ప్రభుత్వం నాలుగు కోట్ల మందిపేద ప్రజలకు ఇళ్లు సమకూర్చగలిగిందని, మరి మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నదని మోడీ తెలిపారు, తన మూడవ విడతలో మహారాష్ట్రలోని వాధవాన్ రేవుతో సహా అనేక లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, అది పూర్తి అయితే దేశంలోనే అతి పెద్దది అవుతుందని ప్రధాని మోడీ చెప్పారు.