Saturday, December 28, 2024

ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -
  • రానున్న ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని వారికి తెలుసు
  • దేశ ప్రగతికి ప్రతిపక్షానికి రోడ్‌మ్యాప్ లేదు
  • కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో బద్ధ శత్రువులు
  • ఇతర ప్రాంతాల్లో జిగ్రీ దోస్తులు: విరుచుకుపడిన ప్రధాని మోడీ

తిరువనంతపురం: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారు కేరళలో బద్ధ శత్రువులని, కాని ఇతర రాష్ట్రాలలో ‘చిరకాల ఉత్తమ మిత్రులు’ (బిఎఫ్‌ఎఫ్‌లు) అని మోడీ పేర్కొన్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో బిజెపి రాష్ట్ర శాఖ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన మోడీ ప్రతిపక్షాల ధోరణిని ఆక్షేపించారు. దేశ పురోభివృద్ధి కోసం ప్రతిపక్షాల వద్ద రోడ్‌మ్యాప్ లేదని, అందుకే అవి రానున్నన లోక్‌సభ ఎన్నికలలో గెలవలేమని దృఢాభిప్రాయంతో ఉన్నాయని, ఆ కారణంగానే వాటి నేతలు తనను దుర్భాషలాడుతున్నారని మోడీ ఆరోపించారు.

‘కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో పరస్పరం శత్రుభావంతో మెలగుతుంటాయి. కాని ఇతర రాష్ట్రాలలో అవి బిఎఫ్‌ఎఫ్‌లు అంటే చిరకాల ఉత్తమ మిత్రులు’ అని ప్రధాని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి (పినరయి విజయన్) అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతుంటారని కాంగ్రెస్ ఆరోపించిందని, వామపక్ష ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా ఆ పార్టీ అభివర్ణించిందని మోడీ చెప్పారు. ‘అందుకు ప్రతిస్పందనగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయించారని, ఆ పార్టీ పూర్వపు ప్రభుత్వాలకు వివిధ కుంభకోణాలలో ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, కేరళ వెలుపల ఇండియా కూటమి సమావేశాలలో వారు కలసి కూర్చుంటారు, సమోసాలు, బిస్కట్లు తింటారు, తేనీరు తాగుతారు’ అని మోడీ వాటి అసంబద్ధత గురించి ప్రస్తావిస్తూ చెప్పారు.

‘అందువల్ల తిరువనంతపురంలో వారు ఒక విషయం చెబుతారు. ఢిల్లీలో వేరే విధంగా మాట్లాడతారు. కేరళ ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికలలో వారి నయవంచనకు సమాధానం ఇస్తారు’ అని మోడీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో రెండు అంకెల సీట్లతో బిజెపిని ఆశీర్వదించాలని కేరళ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. వోటు బ్యాంకు కోణంలో ఏ రాష్ట్రాన్నీ బిజెపి చూడదని మోడీ నొక్కిచెబుతూ, గడచిన పది సంవత్సరాలలో ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల వలె కేరళ అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనం పొందిందని ప్రధాని తెలియజేశారు. కేరళ ప్రజల కలలు, ఆకాంక్షల సాఫల్యానికి వీలుగా అన్ని విధాల కృషి చేస్తామని తాను గ్యారంటీ ఇస్తున్నానని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News