ఇటానగర్ : ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో తన ప్రభుత్వం సాగించిన తరహా అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఈశాన్య ప్రాంతంలో రూ. 55600 కోట్లు విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించిన తరువాత ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ‘వికసిత్ భారత్ వికసిత్ ఈశాన్యం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దక్షిణాసియా, తూర్పు ఆసియాతో భారత వాణిజ్య, పర్యాటక, ఇతర సంబంధాలలో ఈశాన్య ప్రాంతం దృఢమైన అనుసంధానం కాబోతున్నది. ఇప్పుడు ఇక్కడ రూ. 55600 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ఆవిష్కరించడమైంది’ అని ప్రధాని తెలియజేశారు.
‘ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో మేము చేసిన తరహా పనికి కాంగ్రెస్‌కు 20 సంవత్సరాల వ్యవధి పట్టి ఉండేది’ అని మోడీ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ సందర్శించేవారికి ‘మోడీ గ్యారంటీ’ అంటే ఏమిటో స్పష్టం అవుతుందని ప్రధాని అన్నారు. ‘మోడీ గ్యారంటీ పని ఎలా పని చేస్తున్నదో మొత్తం ఈశాన్య ప్రాంతం చూస్తున్నది’ అని ఆయన చెప్పారు. దేశం అభివృద్ధి నిమిత్తం తాను పాటు పడుతుంటే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తనను ‘విమర్శిస్తున్నారు’ అని కూడా ప్రధాని చెప్పారు. తవాంగ్‌కు అన్ని కాలాల్లో అనుసంధానం కలిగించే సెలా సొరంగ మార్గాన్ని మోడీ శనివారం ప్రారంభించారు. 2019లో శంకుస్థాపన కార్యక్రమం తరువాత సెలా సొరంగ మార్గం ప్రారంభం ‘మోడీ గ్యారంటీకి నిదర్శనం’ అని ఆయన చెప్పారు.
‘ఎన్నికల అజెండాగా వ్యూహాత్మక సొరంగ మార్గానికి నేను శంకుస్థాపన చేశానని కొందరు భావించారు. కానీ ఇప్పుడు వారి అంచనా తప్పింది’ అని మోడీ చెప్పారు. అత్యంత చేరువవాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)కి అత్యంత చేరువలో ఉన్న కారణంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అధికారి ఒకరు చెప్పారు. ప్రధాని కుటుంబం గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుండడాన్ని మోడీ ప్రస్తావిస్తూ, మొత్తం ఈశాన్య ప్రాంతం, దేశం తన కుటుంబం అని మోడీ చెప్పారు. “వికసిత్ భారత్’ కల సాఫల్యానికి గాను దేశంలోని ప్రతి కుటుంబానికి శుభ్రమైన మంచి నీరు, ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు లభించేలా చూడడం నా ప్రాథమ్యం’ అని మోడీ చెప్పారు. ‘దేశంలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడమే మా లక్షం’ అని ప్రధాని మోడీ తెలిపారు.