- ఎమర్జెన్సీ పాప ప్రక్షాళన కాంగ్రెస్‌కు అసాధ్యం
- నెహ్రూ, ఇందిర, రాజీవ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేశారు
- 55ఏళ్ల పాలనలో 75సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు
- ఉమ్మడి పౌరస్మృతి అంబేద్కర్ ఆశయం..అందుకే లౌకిక పౌరస్మృతిని తీసుకొస్తున్నాం
- లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని , ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదన్నారు.
“ఈ దేశాన్ని ఒకే కుటుంబం 55 ఏళ్ల పాటు పాలించింది. ఆ కుటుంబం ఈ దేశానికి అనేక విధాలుగా నష్టం కలిగించింది. 1947 నుంచి 1952 వరకు ఎన్నికైన ప్రభుత్వం మనకు లేదు. ఆ సమయంలో ఆ కుటుంబం ఈ దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు. ఆయన తప్పు చేస్తున్నారని బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. ఎంతోమంది పెద్దలు సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారు. వేలాది మందిని జైళ్లకు తరలించారు. కోర్టుల నోరు, పత్రికల గొంతు నొక్కేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని కూడా అడ్డుకున్నారు.న ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు పన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇదే కాంగ్రెస్ పాలన తీరుకు నిదర్శనం ”అని మోడీ విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య పండగను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇది దేశం గర్వపడే క్షణాలని అన్నారు. “ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది. దేశాధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవం దక్కాలి. మన రాజ్యాంగం… మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు ” అని మోడీ పేర్కొన్నారు.
ఉపాధిని వెతుక్కుంటూ పేదలు పలు ప్రాంతాలకు వెళ్తారని, పేదలకు ఇబ్బంది లేకుండా వన్ నేషన్… వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చామన్నారు. “ పేదలు ఎక్కడున్నా రేషన్ సులువుగా తీసుకోవాలి. ఆయుష్మాన్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నాం. డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన రాజ్యాంగం.. అన్నిభాషలను గౌరవించింది. రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యపడుతుంది ” అని తెలిపారు.