Monday, January 20, 2025

అధికారంలో ఉన్నా ఒబిసి కోటా అమలు చేయలేదు: మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా
అధికారంలో ఉన్నా ఒబిసి కోటా అమలు చేయని కాంగ్రెస్
చత్తీస్‌గఢ్‌ను దోచుకోవడమే వారి ఏకైక లక్షం
మహాసముంద్ సభలో ప్రధాని మోడీ ధ్వజం

మహాసముంద్: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు పంచాయతీనుంచి పార్లమెంటు దాకా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒబిసిలకు రిజర్వేషన్లు అమలుచేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. సోమవారం చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో జరిగిన బిజెపి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చత్తీస్‌గఢ్‌ను లూటీ చేసి తన బొక్కసాలు నింపుకోవాలన్నదే కాంగ్రెస్ ఏకైక లక్షమని దుయ్యబట్టారు. గత అయిదేళ్ల కాలంలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ కుమారుడు, ఆయన బంధువులు, ఆయనకు సన్నిహితంగా ఉండే అధికారులు చత్తీస్‌గఢ్‌ను నిలవునా దోచుకున్నారని కూడా ప్రధాని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ నాయకుడు కూడా సామాజిక మాధ్యమాల్లో స్థానిక ఉత్పత్తులనే కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదని తాను చాలెంజ్ చేసి చెప్పగలనని కూడా అన్నారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన తొలి విడత ఎన్నికలు కాంగ్రెస్ ‘అబద్ధాల బుడగ’ను పేల్చేసిందని, ఇప్పడు రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయిచుకున్నారని మోడీ అన్నారు.90 అసెంబీల స్థానాలున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 20 స్థానాలకు ఈ నెల 7న తొలి విడత పోలింగ్ జరగ్గా, ఈ నెల 17న మిగతా నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

గత పదేళ్ల కాలంలో కేబిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పేదలకోసం 4 కోట్ల ఇళ్లను నిర్మించిందని ఆయన అన్నారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి అడ్డంకులు సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీనుంచి వచ్చే కొంతమంది కాంగ్రెస్ మహాజ్ఞానులు బహిరంగ సభల్లో మోడీ ఒబిసి కులానికి చెందిన వాడని చెప్పడంద్వారా తన కులానికి ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ నేతలు మోడీ పేరున్న నేతలంతా దొంగలేనంటూ విమర్శించారని ఆయన గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్‌లో బలమైన ఒబిసి వర్గం సాహులకు కాంగ్రెస్ పార్టీ గత అయిదేళ్లలో ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని, దాన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ల మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చని కూడా ఆన్నారు.

ఏళ్ల తరబడి పంచాయతీనుంచి పార్లమెంటు దాకా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒబిసిలకు రిజర్వేషన్లు అమలు చేయలేదని ప్రధాని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వలేదని, వైద్య కళాశాలల్లో ఒబిసి రిజర్వేషన్లు అమలు చేయలేదని, అయితే మోడీ ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఒక గ్యారంటీ ఇచ్చారని ఆయన అన్నారు. చత్తీస్‌గఢ్‌లో ఇది తన చివరి బహిరంగ సభ అని ప్రధాని అంటూ, రాష్ట్రంలో బిజెపి విజయం ఖాయమని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం తనకు మద్దతు ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News