Thursday, January 23, 2025

నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమిని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులలో జైలు శిక్షలు పడాలంటూ పరస్పరం తిట్టిపోసుకున్న పార్టీలన్నీ మోడీపై పోరాటం పేరుతో ఏకమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఆర్‌జెడి(ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం) దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకువచ్చాయంటే మనం చాలా బలహీనమైన, పేద దేశమని ప్రపంచ దేశాలు ఆలోచించడం మొదలు పెట్టాయని మోడీ అన్నారు. గోధుమలు వంటి తమ ఆహార సరఫరాల కోసం అల్లాడిపోయే చిన్న దేశాల నుంచి ఉగ్రవాదులు ఇష్టారీతిన భారత్‌పై దాడి చేసేవారని ఆయన చెప్పారు.

శక్తివంతమైన దేశాల జోక్యాన్ని అర్థించడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయంలో చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. మనది చాలా ప్రాచీన దేశమని, మగధ వంటి శక్తివంతమైన రాజ్యాలు, చంద్రగుప్త మౌర్య వంటి గొప్ప రాజులు పాలించిన దేశమని ఆయన అన్నారు. శత్రుకు వారి సొంత గడ్డపైనే గట్టిగా బుద్ధి చెబుతున్న కొత్త భారత్‌ను ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తోందని ఆయన చెప్పారు. విదేశీ విధానంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పును చూసి ప్రపంచ దేశాలు సైతం సంభ్రమాశ్చర్య్లాలకు లోనవుతున్నాయని ఆయన అన్నారు. స్వీయ రక్షణను సాధించుకున్నామని, ముఖ్యమైన వ్యవహారాలలో మన సలహాను ప్రపంచ దేశాలు కోరుతున్నాయని, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని, విజయవంతంగా చంద్రయాన్ ప్రయోగించామని, జి20 సదస్సును విజయవంతంగా నిర్వహించామన్న ప్రశంసలు పొదామని ప్రధాని మోడీ తెలిపారు. ఇవన్నీ మోడీ వల్లే సాధ్యమయ్యాయని మీరు భావిస్తే పొరపాటని, మీ ఓటుతోనే ఇవి సాధ్యమయ్యాయని మోడీ తెలిపారు.

గత పదేళ్లలో తాను సాధించిన విజయాలను ట్రయలర్‌గా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతిపరులు జైలులో ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. అవినీతిపరులను తొలగించండి అని తాను అంటుంటే మోడీని ఓడించాలని వారు అంటున్నారని ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్-ఆర్‌జెడి కూటమిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓబిసి నాయకుడు కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వడాన్ని, రాష్ట్రపతిగా దళిత వ్యక్తి రాం నాథ్ కోవింద్‌ను, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికను కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. కొద్ది నెలల క్రితమే తిరిగి ఎన్‌డిఎ కూటమిలో చేరిన నితీశ్ కుమార్‌ను బీహార్ సమగ్రాభివృద్ధి సృష్టికర్తగా అభివర్ణించారు.

రైల్వే మంత్రిగా నితీశ్ కుమార్ గతంలో అద్భుతంగా పనిచేశారని, కాని లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నపుడు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని మోడీ ఆరోపించారు. దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో ఎల్‌ఇడి బల్బులతో వెలుగులు నింపాలని ఎన్‌డిఎ భావిస్తుండగా తిరిగి లాంతరు కాలానికి తీసుకువెళ్లాలని ప్రతిపక్ష కూటమి ఆలోచిస్తోందని పరోక్షంగా ఆర్‌జెడి ఎన్నికల చిహ్నం లాంతరును ప్రస్తావిస్తూ మోడీ ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News