Sunday, January 19, 2025

ఆ నషాకళ్లకు అంతా గమ్మత్తే: మోడీ

- Advertisement -
- Advertisement -

వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. తమ సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఒక నేతకు వారణాసి జనం, ఇక్కడి యువత అంటే బాగా అలుసు అని, అందుకే వారు వొళ్లు మరిచి ఏదేదో మాట్లాడుతుంటారని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. వారణాసిలో జనం బాగా మందుకొట్టి రోడ్లపై పడి దొర్లుతున్నారని రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ఇటువంటి మాటలు మాట్లాడే వారికి కనీస విచక్షణ ఉందా? లేక వారు స్పృహకోల్పోయి ఇటువంటి మాటలకు దిగుతున్నారా? అని ప్రశ్నించారు. కాశీ (వారణాసి) పిల్లలు తాగుబోతులు అని అనే వారికి అసలు బుద్ధుందా? అని నిలదీశారు. హోష్‌లో లేని వారే ఇక్కడి యువతను నషేరీ అని ఎకసక్కాలకు దిగుతారని చెప్పారు. వారణాసికి ప్రధాని మోడీ గురువారం అర్థరాత్రి వచ్చారు. శుక్రవారం ఇక్కడతమ పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు అయిన బహిరంగ సభలో మాట్లాడారు.

పరివార్‌వాద్ , అవినీతి, కొన్ని వర్గాలకు రాయితీలతో ఉత్తరప్రదేశ్ పూర్తిగా దశాబ్దాల పాటు వెనుకబడిందని కాంగ్రెస్ ఇతర పార్టీల పాలనలపై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ షాహీ పరివార్‌కు చెందిన వారు వారణాసి యువతను చులకన చేస్తున్నారని , వీరిని మద్యం తీసుకునే వారని అంటున్నారని రాహుల్‌ను దృష్టిలో పెట్టుకుని స్పందించారు. యువరాజులు ఇక్కడికి వచ్చి ఏదేదో వాగిపోతూ ఇక్కడి యువతను కించపర్చడం భావ్యమేనా? అని ప్రశ్నించారు. ఆయన వాడే భాష ఏమిటీ? వారు రెండు దశాబ్దాలుగా మోడీని తిట్టిపోస్తూ వచ్చారని, ఇప్పుడు మరింత దిక్కుతోచని స్థితికి వచ్చిన వాడై యువరాజు ఇక్కడికి వచ్చి ఏకంగా యుపి యువజనంపై తమ నిస్పృహ వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమి ఇక్కడి యువతను అవహేళన చేయడాన్ని తాను ఎప్పటికీ క్షమించేది లేదన్నారు. కించపరిచేలా మాట్లాడటం ప్రత్యేకించి వారణాసి యువతరానికి కళంకం ఆపాదించడం వారి నిజమైన ముసుగు. వారి రూపం. ఇటువంటి వారు కుటుంబ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారని , యువత ప్రతిభ అంటే వారికి మంట అని విమర్శించారు.

ఇండియా కూటమికి ఇప్పుడు కాశీ, అయోధ్య కొత్త రూపం చూసి నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రగతి వారి కంటపడదు. కానీ ఇక్కడి వారిని ఏదో విధంగా అవమానించడం అలవాటు అయిందని విమర్శించారు. కాంగ్రెస్ వల్లనే ఉత్తరప్రదేశ్ ఎన్నో ఏళ్లుగా వెనుకపడిందని తెలిపారు. అర్థరాత్రి తరువాత వారణాసికి వచ్చిన మోడీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ఈ పుణ్యస్థలంలో నిర్మించిన కొత్త రాదారి నాణ్యతను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. శివ్‌పుర్ పుల్‌వరియా, లహ్త్రారా మార్గ్‌పై కలియతిరిగారు. ఆయన వెంట కేవలం ఒక్క ఆదిత్యానాథ్ ఉన్నారు. సంబంధిత ఫోటోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. అంతకు ముందు రాత్రిపూటనే కాశీ వీధులలో రోడ్‌షో నిర్వహించారు.
సన్నకారు రైతులు, చిన్న పరిశ్రమల దూతను
తాను స్థానిక కుటీరపరిశ్రమలను ప్రోత్సహిస్తానని, లోక్‌ల్ కోసం నినదిస్తానని చెపుతూ సన్నకారు రైతులను, సంస్థల కోసం వాదించేవాడినని తెలిపిన మోడీ తనను వీరి ప్రచారకర్తగా భావించవచ్చునని , స్థానికంగా ఉండే చేతివృత్తుల వారిని ఎక్కడికక్కడ ప్రోత్సహించాల్సి ఉందన్నారు.

ఎన్నికలప్పుడే కలిసే బాపతు ఇండియా కూటమిపై మోడీ పిడుగులు
ఎన్నికలు సమీపిస్తున్న దశలో ప్రధాని మోడీ వారణాసి బహిరంగ సభలో విపక్ష ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కొందరు ఎన్నికలప్పుడు ఒకే వేదికపైకి వస్తుంటారు. ఎన్నికల్లో ఫలితాలు దక్కకపోవడంతో , ఎవరికి వారే అవుతారు. తిరిగి ఒకరిపై ఒకరు తిట్లకు దిగుతుంటారని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తనకు అపార విశ్వాసం ఉందని, ఈసారి ప్రజానాడి అంతా కూడా మోడీ గ్యారంటీలకు సానుకూల ముద్రతో ఉందన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో సీట్లన్ని కూడా ఎన్‌డిఎకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు సంబంధించినంత వరకూ మూడో దఫా అధికారం మరింత అలుపెరుగనిది అని తేల్చిచెప్పారు.
బనారసిని అయ్యాను ః మోడీ
ఈ పది సంవత్సరాలలో తాను వారణాసి ఎంపిగా ఉన్నానని, కాశీతో సంబంధాలు పెరిగాయని, తాను బనారసిని అయ్యానని చమత్కరించారు. ఇక్కడి వాడిగా గుర్తింపు పొందినందున తాను ఇక్కడి కాశీపౌరుల జీవనస్థితిగతులను మరింత మెరుగుపర్చే దిశలో పాటుపడుతానని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇతరులు కూడా హాజరయిన సభలో హర్షధ్వానాలనడుమ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News