Wednesday, January 22, 2025

ఈజిప్టు అధ్యక్షుడితో మోడీ చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్‌సిసితో ఫోన్‌లో చర్చించినట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదం, హింస, సామాన్య పౌరుల మరణాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యం లోనే వారు ఈ మేరకు శనివారం చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని వీరు పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన బాధితులకు మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.

పరిస్థితులు మరింత దిగజారితే వచ్చే ముప్పుపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు , ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందో చర్చించినట్టు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో సంభాషించిన విషయం తెలిసిందే. కాగా శనివారం మోడీ, సిసిలు పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, ఆ ప్రాంతంపైన, ప్రపంచంపైన దాని ప్రభావం గురించి చర్చించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఉగ్రవాదం, హింస, ప్రాణనష్టంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారని, ఇజ్రాయెల్‌పాలస్తీనా వివాదంపై భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని ప్రధాని మరోసారి స్పష్టం చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈజిప్టుతో భారత దేశానికి ఉన్న అభివృద్ధి భాగస్వామ్యం, పాలస్తీనా ప్రజలకోసం అందిస్తున్న మానవతా సాయం గురించి సిసితో జరిగిన చర్చల్లో ప్రధాని ప్రధానంగా గుర్తు చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది. వీలయినంత త్వరగా శాంతి, సుస్థిరతల పునరుద్ధరణ జరగడంతో పాటుగా మానవతా సహాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News