Sunday, January 19, 2025

అవినీతి పరులకు, ఉగ్రవాదులకు స్వర్గధామాలంటూ ఉండవు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అవినీతి పరులకు, ఉగ్రవాదులకు స్వర్గధామాలంటూ ఉండవు : ప్రధాని మోడీ
కట్టడికి ప్రపంచదేశాలు కలిసి రావాలని పిలుపు
ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, డ్రగ్స్ అక్రమ వ్యాపార వర్గాలకు, వేటగాళ్ల గ్యాంగులకు, వ్యవస్థీకృత నేరాలకు స్వర్గధామాలంటూ ఎక్కడా ఉండబోవని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ 90వ సమావేశాల ప్రారంభ సమావేశంలో మోడీ మాట్లాడారు. ఈ సమావేశాలను ఆయన ప్రారంభించారు. సురక్షితమైన ప్రపంచాన్ని నెలకొల్పడమే మనందరి సమష్టి బాధ్యతగా మోడీ పేర్కొన్నారు. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల పౌరుల సంక్షేమానికి హాని కలిగిస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ ఇంటర్‌పోల్ సమావేశంలో 195 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ సంక్షోభాల్లో భారత్ బాధ్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ మంచి శక్తులన్నీ సహకరిస్తే నేరశక్తులు పనిచేయబోవని సూచించారు. వాతావరణ లక్షాల నుంచి కొవిడ్ వ్యాక్సిన్ల వరకు ఏ సంక్షోభాన్నైనా పరిష్కరించే ప్రయత్నంలో భారత్ ఎప్పుడూ ముందుంటోందని చెప్పారు. దేశాలు, సమాజాలు ఆత్మావలోకనం చేసుకుంటున్న తరుణంలో మరింత ఎక్కువగా సహకరించుకోవాలని భారత దేశం పిలుపునిస్తోందని చెప్పారు. ముప్పు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు స్పందన స్థానిక స్థాయిలో ఉండకూడదని చెప్పారు. ప్రపంచం మొత్తం మీద నేరాలను అదుపు చేయడంలో, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడంలో ఇంటర్‌పోల్ పోలీసులు అద్వితీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
2025 నాటికి భారీగా పెరగనున్న సైబర్ నేరాలు: ఇంటర్‌పోల్ చీఫ్
సైబర్ నేరాలు, ఆన్‌లైన్‌లో పిల్లలపై అఘాయిత్యాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇంటర్ పోల్ చీఫ్ జుర్గెన్ స్టాక్ పేర్కొన్నారు. ఇటువంటి నేరాలు చాలావరకు ఫిర్యాదుల వరకు వెళ్లడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి సైబర్ నేరాల విలువ 10.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకొంటుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఇంటర్‌పోల్ సమావేశానికి ముందు జురెన్ స్టాక్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు వేల కోట్లు సంపాదిస్తున్నాయని స్టాక్ వెల్లడించారు. వీటిలో కేవలం 1 శాతం మాత్రమే పట్టుకోవడం గానీ, స్వాధీనం చేసుకోవడం గానీ జరుగుతోందని చెప్పారు. ఇంటర్ పోల్ గ్లోబల్ స్టాప్ పేమెంట్ వ్యవస్థను, యాంటీ మనీ లాండరింగ్‌ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రొటోకాల్ అభివృద్ధి చేసిందన్నారు. గత 10 నెలల్లోనే నేరగాళ్ల నుంచి 60 మిలియన్ డాలర్లు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. 25 ఏళ్ల తరువాత మనదేశంలో జరుగుతున్న ఈ సమావేశాలు శుక్రవారం వరకు కొనసాగుతాయి. మనదేశంలో శాంతి భద్రతల వ్యవస్థలో అత్యుత్తమ విధానాలను ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం కలిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంపును, రూ.100 నాణేన్ని మోడీ విడుదల చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News