న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించే కుట్రలో భాగంగానే ఎన్డీయే ప్రభుత్వం గురించి పలువురు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాటి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ కార్య్కర్తలకు పిలుపునిచ్చారు. జిజెపి 41వ స్థాపనా దివస్ సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘రైతుల భూమి స్వాధీనం చేసుకుంటారు. కొందరి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారు. రాజ్యాంగాన్నే మార్చేస్తారు వంటి అసత్యాలను కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, సిఎఎ, కార్మిక చట్టాలపై ఇలాంటి తప్పుడు కథనాలే వ్యాపించాయి’ అని మోడీ అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాల వెనుక ఉద్దేశపూర్వక రాజకీయాలు ఉన్నాయని.. ఇదొక పెద్ద కుట్ర అని పేర్కొన్నారు.దేశంలో అపోహలు భయాలు రేకెత్తించడం ద్వారా రాజకీయ అస్థిరతలు సృష్టించడమే వీటి ఉద్దేశమని, ఇది మనకొక పెను సవాలని బిజెపి కార్యకర్తలకు వివరించారు.
ఈ నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక దేశంలో వరస విజయాలను సాధిస్తున్న భారతీయ జనతా పార్టీనుద్దేశిస్తూ కొందరు ఇవిఎంలను బిజెపి ఎన్నికల గెలుపు మిషన్‌గా పేర్కొనడంపైనా మోడీ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు, వారి నాయకులు గెలిచినప్పుడు మాత్రం ఇవే ఇవిఎంలను కీర్తిస్తారని.. అలాంటప్పుడు ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకని విమర్శించారు. ఇలాంటి పార్టీలు, నాయకులు భారతీయ ప్రజల రాజకీయ పరిపక్వతను, ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. నిబద్ధదతో కూడిన పాలనను అందించడం వల్లనే ప్రజలు బిజెపికి రెండోసారి అధికారాన్ని అందించారని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లనే ఇది సాధ్యమవుతోందని స్పష్టం చేశారు.
PM Modi speech at BJP 41st Foundation Day