Wednesday, January 22, 2025

మోడీజీ అనకండి..మోడీ అంటే చాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తనను మోడీజీ అనకండి, మోడీ అంటే సరిపోతుంది. పార్టీలో ఏకనాయకత్వం కాదు సమిష్టిత్వం అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించారు. గురువారం ఆయన ఇక్కడ బిజెపి ప్రధాన కార్యాయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఇప్పటి తుపాన్ పరిస్థితిపై సమీక్షించారు. పార్టీలో ఏ కోణంలోనూ ప్రజాస్వామిక లక్షణాలు లోపించరాదు. ఎప్పుడైతే వ్యక్తి ఆరాధనభావం నెలకొంటుందో అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంటుందని మోడీ హెచ్చరించారు. పార్టీ అందరిది, కొందరిదే అనుకోరాదని పిలుపు నిచ్చారు. కొన్ని అంశాలు సమాజంలో అతి త్వరగా రూపం సంతరించుకుంటాయి.

కొన్ని విషయాలు ఇతరత్రా అపార్థాలకు దారితీస్తాయని, దీనిని నేతలు పార్టీ కార్యకర్తలు అంతా గ్రహించితీరాల్సి ఉందని తెలిపారు. ఎప్పుడూ తనను మోడీజి అనే గౌరవభావంతో పిలువవద్దు, తనను సాదాసీదాగా మోడీ అని వ్యవహరిస్తే సరిపోతుందని విన్నవించుకున్నారు. మోడీ పార్టీలో ఓ సాధారణ కార్యకర్తను అని , బిజెపిలో ఇతరుల మాదిరిగానే చూడాలని కోరారు. అంతకు మించి ఏమీ అవసరం లేదన్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ భావోద్వేగపు ప్రసంగానికి దిగడం ఇదే తొలిసారి.

రాష్ట్రాలలో బిజెపి బలంగా లేదనేది తప్పు
ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఓ ప్రచారం జరుగుతోంది. బిజెపి కేంద్రంలో బలంగా ఉందని, రాష్ట్రాల స్థాయిల్లోకి వచ్చే సరికి డీలా పడిందనే విమర్శలు వెలువడుతున్నాయనే వాదన సరికాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లోనూ పరిస్థితి బాగా ఉందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలను బేరీజు వేసుకుంటే పరిస్థితి బాగా ఉందన్నారు. పైగా మన బలం రెండింతలు అయిందన్నారు. మిజోరంలో మెరుగుపడింది. తెలంగాణలో బలం పుంజుకొంటోందన్నారు.

సమిష్టిత్వంతోనే రాష్ట్రాలలో గెలుపు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే విజయానికి కారణం అంతా కలిసికట్టుగా పనిచేయడమే అని మోడీ స్పష్టం చేశారు. మన సమిష్టిత్వానికి దక్కిన విజయం అన్నారు. ప్రజలు బిజెపి పాలనను ఇష్టపడ్డారు. నిర్ణయాలు తీసుకోవడం, అమలుకు దిగడం, పారదర్శకతలకు పట్టం కట్టారని వివరించారు. లేకపోతే ఇంతటి విజయం అసాధ్యం అయి ఉండేదన్నారు. ప్రభుత్వపరంగా , పాలనాపరంగా బిజెపి ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. పార్టీ పట్ల సహేతుకత ప్రతిఫలించింది. ఎక్కడ కూడా యాంటీ ఇంక్యుంబెన్సీ తలెత్తలేదు. ఎక్కడైతే ఎవరైతే పార్టీకి కోసం తమ జీవితాలు ఫణంగా పెట్టారో, అహర్నిశలూ కృషి చేశారో వారిని విజయం వరించిందని తెలిపారు.

అధికారిక వ్యతిరేకత ఓటు అంటని పార్టీ
కేంద్రంలో గతంలో అధికారంలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పలు సార్లు ఎదుర్కోవల్సి వచ్చింది. ఏడుసార్లు ఈ క్రమంలో ఎన్నికలు రాగా ఇందులో ఒకే ఒక్కసారి తిరిగి అధికారం సంపాదించుకుందని మోడీ తెలిపారు. ఇదే దశలో వివిధ రాష్ట్రాలలో కలిపి బిజెపి 17 సార్లు ఓటు పోరుకు దిగాల్సి వచ్చింది. ఇందులో పది సార్లు బిజెపి విజయం పొందిందని మోడీ గుర్తు చేశారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఏడు సార్లు గెలిచాం. ఇక మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ విజయాలు సాధిస్తూనే వెళ్లుతున్నామని తెలిపారు. తమిళనాడులో తుపాన్ బాధిత కుటుంబాలకు, మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బిజెపి కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో సహాయక కార్యక్రమాలలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇటువంటి మానవీయ చర్యలలో ఎక్కడా రాజకీయాలు అంటరాదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News