Thursday, January 23, 2025

తెలంగాణ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

వరంగల్  : దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర కీలకంగా మారిందని ఆత్మ నిర్మల్ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా హనుమకొండ పట్టణంలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. భద్రకాళి మాత ఆశీస్సులతో సమ్మక్క సారలమ్మల వీరత్వం, రాణిరుద్రమాదేవి పరాక్రమంతో ఖ్యాతిగాంచిన వరంగల్‌కు రావడం నాకు సంతోషంగా ఉందంటూ ముందుగా తెలుగులో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు.

బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఉందని మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటి ప్రభావం చూపించిందని చెప్పారు. రాబోయే విధాన సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీని పత్తా లేకుండా చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ల తయారీలో తెలంగాణ భూమిక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం…
సిఎం కెసిఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి కాని తొలిసారిగా రెండు రాష్ట్రాలు అవినీతి కోసం పని చేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. యువత ఆత్మబలిదానాలు చేసింది ఇలాంటి అవినీతిని చూసేందుకేనా, కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందని, కేసీఆర్ అవినీతి పాలనను తెలంగాణ చూస్తోందన్నారు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాల భర్తీలో అవకతవకల గురించి అందరికి తెలిసిందేనని, వీరి అవినీతితో విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటోందన్నారు. కేసీఆర్ లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి యువతను మోసం చేసిందని అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలో మూడువేల అధ్యాపకుల పోస్టులు, పాఠశాలల్లో 15వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

ఆ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ విద్యార్థులకు ద్రోహం చేశారని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌లందరూ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. గ్రామ పంచాయితీలకు అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని, ఇప్పుడు రైల్వే వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగే నాలుగు పనులు చేస్తోందని, ఒకటి మోడీ ప్రభుత్వాన్ని తిట్టడం, కుటుంబ పార్టీని పెంచి పోషించడం, తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ అవినీతిలో నెంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లడమేనని అన్నారు. దళితులు, ఆదివాసీలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం రహదారులు వేస్తూ మౌళిక సదుపాయాల కల్పనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిశ్ఛయించుకున్నారని అన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. మన బిడ్డల భవిష్యత్ కోసం రాబోయే తరాల కోసం తెలంగాణ ప్రజలు బీజేపీని ఎన్నుకోవాలని అన్నారు. ఉద్యమ సమంలో హామీలు ఇచ్చిన బీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు.
ఓరుగల్లు మాకు కంచు కోట….
జన్ సంగ్ కాలం నుంచి వరంగల్ మాకు కంచుకోటలా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ రెండు ఎంపీ స్థానాలు గెలిచినప్పుడు హనుమకొండ అందులో ఒక స్థానమని గుర్తు చేశారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News