Wednesday, January 22, 2025

కల్లోల ప్రపంచానికి మనమే ఆశాకిరణం

- Advertisement -
- Advertisement -
  •  స్థిరత్వం, పటిష్ఠతకు సూచిక హర్యానా ఎన్నికలు
  •  వరుసగా మూడోసారి మా విజయానికి అదే తార్కాణం
  •  ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్’లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజల స్థిరత్వ సందేశానికి మరింత బలం చేకూర్చాయని, కేంద్రంలో తమ ప్రభుత్వం వరుసగా మూడవ విడత అధికారంలోకి రావడంలో అది స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉద్ఘాటించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచార సారథ్యానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో ప్రధాని మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్’లో మోడీ మాట్లాడుతూ. తమ ప్రభుత్వం మూడవ విడతలో కని విని ఎరగని వేగంతో, స్థాయిలో పని చేస్తోందని తెలియజేశారు. ప్రస్తుతం సాగుతున్న వివాదాలతో సహా అసంఖ్యాక తిరుగుబాట్లతోసతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశా జ్యోతిగా మారిందని మోడీ చెప్పారు. భారత్‌కు ‘రెండింతల ఎఐ’ అవకాశం ఉందని, ‘ఆకాంక్షసహిత భారత్’ (ఏస్పిరేషనల్ ఇండియా ఎఐ’), ‘కృత్రిమ మేధ’ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎఐ) కలిస్తే అప్పుడు సహజంగా అత్యంత వేగంగా అభివృద్ధి చోటు చేసుకుంటుందని ఆయన అన్నారు. ఆయన ఈ సందర్భంగా పలు గణాంకాలు ఉటంకించారు. ప్రపంచం సంక్షుభిత సమయాల్లో భారత్‌ను ఒక మిత్రునిగా చూస్తోందని ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్లను పంపాలన్న దేశం నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. భారత్ పురోగతి అసూయకు దారి తీయదని, కాని దేశం వృద్ధికి ప్రపంచం ఆనందిస్తుందని మోడీ చెప్పారు.

‘భారత్ యాదాలాప సంబంధాలను విశ్వసించదు. దేశ సంబంధాలు నమ్మకం, విశ్వసనీయతపై నిర్మితం అయ్యాయి. భారత్ ముందుకు సాగినప్పుడు ఈర్ష ఉండదు కానీ ప్రపంచం ఆనందిస్తుంది, ఎందుకంట భారత్ పురోభివృద్ధి ప్రపంచానికి మేలు చేస్తుంది’ అని ఆయన చెప్పారు. ‘భారత్ చరిత్రలో ప్రపంచ వృద్ధికి ఆలంబనగా ఉన్నది, కానీ బానిసత్వంతో ఇబ్బందులు పడింది, పారిశ్రామిక విప్లవాలను అవకాశంగా తీసుకోలేకపోయింది. ఇప్పుడు పరిశ్రమ 4.0 కాలం. మేము ఇక ఎంత మాత్రం బానిసత్వంలో లేము. పారిశ్రామికీకరణకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమ 4.0 కావలసిన నైపుణ్యాలు, మౌలిక వసతుల రూపకల్పనకు దేశం కృషి చేస్తోంది’ అని మోడీ తెలియజేశారు.

భారత డిజిటల్ సార్వత్రిక మౌలిక వసతులు (డిపిఐ) అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుల్లో చర్చలకు తరచు ఆధారభూతం అవుతున్నాయని ఆయన పేర్కొంటూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రజాస్వామికీకీకరణలో తన ప్రభుత్వం పోషించిన పాత్ర గురించి నొక్కిచెప్పారు. డిజిటల్ సృజనాత్మకత, ప్రజాస్వామ్య విలువలు కలసి మనుగడ సాగించగలవని, ఆధిపత్యానికి, విభజనకు కాకుండా సమ్మిళితానికి, పారదర్శకలతకు, సాధికారతకు టెక్నాలజీ ఒక సాధనం కాగలదని దేశం నిరూపించిందని ప్రధాని తెలిపారు, యుపిఎ, పిఎం గతి శక్తి, ఒఎన్‌డిసి వంటి సాంకేతిక ఆధారిత వేదికలను ఆయన ఇందుకు నిదర్శనంగా ప్రస్తావించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని, బలమైన శక్తిగా రూపొందుతున్నదని ఆయన చెప్పారు.

‘పేదరికం సవాళ్లపై మాకు అవగాహన ఉన్నది, పురోగతికి ఎలా మార్గం వేయాలో కూడా మాకు తెలుసు. మా ప్రభుత్వం సత్వర వేగంతో విధానాలు రూపొందిస్తున్నది, నిర్ణయాలు తీసుకుంటున్నది, కొత్త సంస్కరణలు చేపడుతోంది’ అని మోడీ తెలియజేశారు. తన ప్రభుత్వం మూడవ విడతలో పని చేస్తున్న వేగం కారణంగా భారత వృద్ధి రేట్లను పలు రేటింగ్ సంస్థలు సవరించాయని ప్రధాని తెలిపారు. భారత్ ముందు చూపుతో సాగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న తీర్మానం ఈ భావజాలానికి తార్కాణమని మోడీ పేర్కొన్నారు. ‘ఆరు దశాబ్దాల్లో మొదటిసారిగా జనం వరుసగా మూడు విడతలు ఒక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఇది స్థిరత్వ సందేశం. ఇటీవలి హర్యానా ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ స్థిరత్వ సందేశాన్ని పునరుద్ఘాటించారు’ అని మోడీ తెలిపారు.

ఇటీవలి హర్యానా ఎన్నికల్లో బిజెపి 90 సీట్లకు 48 సీట్లు గెలుచుకొని ఎగ్జిట్ పోల్స్ జోస్యాలను వమ్ము చేసిన విషయం విదితమే. ప్రపంచంలో వృద్ధి చెందుతున్న భారత్ ప్రతిపత్తి, సర్వతోముఖాభివృద్ధి సాధనపై తన ప్రభుత్వం దృష్టి గురించి ప్రధాని ఉద్ఘాటిస్తూ, తన ప్రభుత్వం మూడవ విడతలో రూ. 9 లక్షల కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిందని, 8 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్నదని, యువత కోసం రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజిపై సంతకం చేసిందని, రైతుల ఖాతాలకు రూ. 21 వేల కోట్లు బదలాయించిందని, రూ. 5 లక్షల వరకు వ్యయానికి ఆరోగ్య బీమా పథకం కిందకు 70 ఏళ్లు పైబడిన వృద్ధులను తీసుకువచ్చిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News