హైదరాబాద్: ప్రజల సొమ్ము అవినీతి పరులకు చేరకుండా చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ”డిజిటల్ విధానం ద్వారా దళారి విధానం లేకుండా చేశాం. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం.
అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయం. అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా?. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?. అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోవాలా? వద్దా?. 2014 నుంచి వచ్చిన మార్పును దేశమంతా చూస్తోంది. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి.బిజెపిని ఆశీర్వదిస్తే.. తెలంగాణలో మరింత అభివృద్థి జరుగుతుంది” అని పేర్కొన్నారు.