Wednesday, January 22, 2025

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ సుస్థిర ప్రభుత్వ ప్రయోజనాలను ప్రజలు కళ్లారా చూస్తున్న కారణంగా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్న నినాదాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు.

దేశంలో బలహీనమైన, అస్థిరమైన ప్రభుత్వాలు ఉన్న చోట శత్రువులు పెట్రేగిపోవడమేగాక ఉగ్రవాదం వ్యాప్తి చెందుతుందని మోడీ అన్నారు. కాని..కేంద్రంలో బలమైన మోడీ ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే భద్రతా దళాలు అంతం చేస్తున్నాయని ఆయన చెప్పారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను తాను అడ్డుకున్నానని, దీంతో వారికి తనపైన పీకలదాకా కోపం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మైలిక సౌకర్యాలను పటిష్టం చేయలేదని, ఇప్పుడు సరిహద్దుల వెంబడి రోడ్లు, ఆధునిక సొరంగాలు నిర్మాణం అవుతున్నాయని ప్రధాని తెలిపారు.

శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించిన కాంగ్రెస్ అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిందని మోడీ ఆరోపించారు. అయినప్పటికీ తాము క్షమించి అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించామని, అయినప్పటికీ దాన్ని కూడా కాంగ్రెస్ బహిష్కరించిందని మోడీ చెప్పారు. ఇంతటితో ఆగకుండా శక్తి స్వరూపిణులుగా భక్తులు కొలిచే ఉత్తరాఖండ్‌లోని మా ధారీ దేవి, మా చంద్రబద్నీ, మాజీ జ్వల్పాదేవి వంటి దేవలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా యుద్ధం ప్రకటించిందని మోడీ ఆరోపించారు. ఉత్తరాఖండ్ సంస్కృతిని ధ్వంసం చేయడానికి ప్రస్తుతం జరుగుతున్న కుట్రకు ఇటువంటి ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోసినట్లు మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News