Sunday, January 19, 2025

రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని చాపకిందనీరులా దేశం మొత్తం వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నది. అందుకు నిదర్శనం అయోధ్యలో రామమందిర ప్రారంభంలో ప్రధాని చేసిన ఉప న్యాసమే తార్కాణం. ప్రారంభోత్సవంలో మాత్రం పాల్గొన్నది దేశంలోని సాధువులు, సన్యాసులు, బడా వ్యాపారవేత్తలు, కోట్లాధిపతులు. రామరాజ్యం రావాలని కోరుకున్న ప్రధాని పెట్టుబడిదారుల ఆలయంగా, ఆలవాలంగా ఈ దేశాన్ని మార్చడం కొట్టిపారేయలేని వాస్తవం. ఎన్నికల ముందు రామ మందిరాన్ని ప్రారంభించి ప్రజల భావోద్వేగాలను తన వైపు మరల్చుకోవడం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రధాన భూమిక. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోడీ కలిసి రామ మందిరాన్ని ప్రారంభించారు. దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? ఈ ప్రారంభోత్సవంతో మతం ముసుగులు పూర్తిగా తొలిగిపోయాయి. ఇక అంతా బహిరంగమే! ఎన్నికలయ్యే దాకా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి మత ఉద్రికత్తలు, ఘర్షణలు జరుగుతాయో తెలియని పరిస్థితి.

మోడీ మతాన్ని, రాజకీయాలను వేరు చేసి చూడటం లేదు? మతానికి రాజకీయాలను అనుసంధానం చేసి అధికారం కోసం తన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. గత 75 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని కేంద్రం అమలు చేస్తున్నది. 1990లో ఎల్‌కె అద్వానీ రామజన్మభూమి పేరుతో రథయాత్ర ప్రారంభించి 1984లో రెండు సీట్ల నుంచి 150 సీట్లకు తీసుకొచ్చారు. అప్పటి నుంచే కాషాయపు జెండా తన ఎజెండాను పూర్తిగా మార్చుకున్నది. బిజెపిగా అవతరించింది. పేరు మారింది, ప్రజలను ఏమార్చింది, తన విధానాలను ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని రామజన్మభూమితో కొనసాగించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంకం పూర్తయింది. ఇక మధురలో కృష్ణ దేవాలయం. ఇతర దేవాలయాలపై దృష్టి సారించింది. నిరంతరం ప్రజలను మత ఉద్వేగాల వైపు మరలించి ఓట్లు దండుకునే కార్యక్రమాన్నే బిజెపి పెట్టుకున్నది. మత విశ్వాసాలు మనిషి వ్యక్తిగతానికి సంబంధించినవి. అందులో ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మతం వారిది.

పరమత సహనం పాటిస్తూ అందరినీ కలపుకు పోయేదే రాజనీతి. రాజకీయాలు లౌకికత్వానికి సంబంధించినవి. వర్తమానంలో రాజకీయాలలో మతం ప్రధాన పాత్ర వహించే విధంగా బిజెపి తన ఎత్తుగడలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు రామ జన్మభూమి, రామాలయం వంటి అంశాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. రామాలయాలు దేశమంతటా ఉన్నాయి.రాముడు ప్రజాసంక్షేమాన్ని కాంక్షించాడని చెప్తారు. అధికారాన్ని వదిలి అన్న మాట కోసం అడవులకు పోయాడట. రామనామం జపించే పాలకులు చేసిన వాగ్దానాలను వుట్టి మీదకు ఎక్కించారు. నిత్యావసర ధరలను ఆ కాశమార్గం పట్టించారు. సగటు పేద ప్రజలు కొనలేని ధరలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది లౌకిక రాజ్యంలో ప్రజల్ని తిరోగమనం వైపు నడిపించడమే తప్ప వేరే కాదు.
అధికారంలోకి రాక ముందు మోడీ మాయమాటల్ని ప్రజలు విశ్వసించారు. రైల్వేస్టేషన్‌లో ఛాయ్ అమ్మినవాడు, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ప్రచారార్భటం ప్రారంభిస్తే అందరూ గుడ్డిగా నమ్మారు. బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మోడీ చేసిన వాగ్దానాలేమిటి? నేడు చేస్తున్నదేమిటి? పేద ప్రజల, కార్మికవర్గ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.

రైతాంగం పట్ల దోపిడీ విధానాన్ని అనుసరించే చట్టాలను సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. కార్మిక వర్గాలను పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే చేదు మందులాంటి సంస్కరణలకు చక్కెరపూత పూశారు. యాజమాన్యాలకు కార్మికవర్గం బానిసలుగా పని చేయాలని తిరోగమన సంస్కరణలను ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారుల లాభాలకు, వారి సంతోషం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని మోడీ ఎప్పటికప్పుడు తన విధానాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. కోట్లాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మూలుగుతున్నా పేద ప్రజలకు పంచడానికి చేతులు రావడం లేదు కానీ అదానీ, అంబానీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపా యలను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని వేగంగా పెంచి పోషిస్తున్నది ఎవరు, మోడీ కాదా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఊసెక్కడీ ఉన్న ఉద్యోగాలను ఊడపీకడమే కాకుండా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని సెలవిచ్చిన మోడీ ఈ దేశానికి ‘మహానాయకుడు’, ‘విశ్వగురు’!
ప్రభుత్వరంగ పరిశ్రమలను టోకుగా అమ్మడం, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం లాంటి చర్యలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు బిజెపి పాలకులు.

ఎన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మింది, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టితే ఎంత సంపద వచ్చిందో గర్వంగా చెపుకుంటున్నారు. కానీ దేశాన్ని దోచుకుని సరిహద్దులు దాటించిన బడా పారిశ్రామిక వేత్తలను గురించి ఒక్కరోజు కూడా మాట్లాడరు! ప్రజల సొమ్మును పట్టపగలే నిర్భయంగా కోట్లది రూపాయలను బ్యాంకు రుణాల ద్వారా దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళ గురించి అసలు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. నేడు ప్రపంచంలో మూడవ కుబేరుడిగా గౌతమ్ అదానీ ఎదిగాడు! ఇది ఎవరి చలువ అందరికీ తెలిసిందే? కేవలం మోడీ ఈ పదేండ్ల పాలనలో ఆదానీలు, అంబానీలు, టాటా, బిర్లాలు కోట్లాది ఆస్తులను సంపాదిస్తూ వేగంగా ప్రపంచ కుబేరులను దాటిపోతున్నారు. దగాపడ్డ ప్రజల ఆదాయం, ప్రజల జీవనస్థితులు మాత్రం మారడం లేదు? కారణం, ప్రజల్ని మతం చుట్టూ భ్రమింపజేయడం ద్వారా అంతర్గత వ్యూహాల్ని అమలుచేస్తున్నారు. నూటికి ఎనభై శాతం వ్యవసాయ దేశంలో రైతుల బతుకులు చితికిపోతున్నా వారి గురించి పట్టించుకోరు. ప్రజల సంపద బడా కోట్లాధిపతుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా మాట్లాడే పరిస్థితిలో ఎవరూలేరు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైతున్నాయి, క్షీణిస్తున్నాయి, సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

బిజెపి పాలనలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగమైన దేశానికి ప్రయోజనకరమైన బడా ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మివేయడం లేదా అంగడి దుకాణాలు ఇచ్చినట్లు కిరాయిలకు ఇవ్వడం చేస్తున్నది. అదేమంటే ‘నష్టాలు వస్తున్నాయి, దేశం భరించలేదు. పేదరికాన్ని తీర్చడం కోసమే తాకట్టు పెడుతున్నట్టు’ చెబుతున్నది. పేదలను ఏమార్చుతున్నది. ఇది దేశానికి నష్టదాయకమే కాదు, భవిష్యత్తుకు శాపం! ప్రభుత్వ పరిశ్రమలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మాత్రం ఒకటికి పదింతలు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు, డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకుంటున్నారు. మన పాలకులు ఆనందపడుతున్నారు. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల సొమ్మును కొంత మంది పెట్టుబడిదారులు దోచుకోవడం, దాచుకోవడం పరిపాటిగా పెట్టుకున్నారు. అందుకు మోడీ అండదండలే అన్నది దేశ పౌరులకు తెలియంది కాదు? ఓ వైపు పన్ను ఎగవేతలు, మరో వైపు భారీ కుంభకోణాలు విజృంభిస్తుంటే వాటి నియంత్రణలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు?

మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ రూ. 65 లక్షల కోట్ల అప్పు ఉన్న మన దేశం నేడు రూ. కోటి 55 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది మోడీ పాలనలో జరిగిన అప్పుల అభివృద్ధి. ఒకవైపు దేశం ప్రగతి వైపు దూసుకుపోతుందని చెప్తున్న ప్రభుత్వం అప్పులలో రాకెట్ కంటే వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. అప్పులు తీర్చడానికే కేంద్ర బడ్జెట్‌లో అధిక శాతం వడ్డీలకు కట్టాల్సి వస్తుంది. దేశ ప్రజలపై ఎక్కడలేని భారాలను మోపుతున్నది. దేశ ఆదాయవనరుగా ఈదేశంలోని కోట్లాది పేద ప్రజలను సరుకుగా మార్చుకుంటున్నది. దుడ్డుకర్ర లాంటి వివిధ పథకాలు తెచ్చి మధ్యతరగతి, పేదవర్గాల నడ్డి విరగ్గొడుతున్నది. అధికారం చేతిలో ఉందని తనకు తోచిన విధంగా వెనక ముందు చూడకుండా తిరోగమన విధానాలు అమలు చేస్తు న్నది. చేసిన సంస్కరణలు మేలు చేయకపోగా వికటించినా వారిపై భారాలు వేసే సాహసకృత్యాలను మాత్రం వీడడం లేదంటే ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుందా? పెద్ద నోట్ల రద్దు,

జిఎస్‌టి వంటి చర్యలు దేశాన్ని కుదేలు చేసింది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టకపోవడంతో కోట్లాది మంది అసంఘటిత కార్మికుల ఉసురు తీసింది. రెక్కాడితేగాని డొక్కాడని కార్మికుల, పేద ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఈ దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీసుకొస్తామని జబ్బలు చరిచింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోని ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పింది. ఇదిగో అదిగో అంటూ ఉపన్యాసాలిస్తుంటే ఆశ తీరని ప్రజలు బ్యాంకు ఖాతాలను మళ్లీమళ్లీ తెరచి చూసుకోవాల్సి వచ్చింది. తీరా చూస్తే అది పులి కాదు గోముఖ వ్యాఘ్రమని తెలిసింది. ఒక్క రూపాయి నల్లధనం కూడా బయట పెట్టలేకపోయింది? దీనికి తోడు ధరల్ని అదుపు చేయడంలో, నిరుద్యోగం రూపు మాపడంలో, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు.
ఈ పదేండ్ల మోడీ పాలనలో మాటలు కోటలు దాటుతున్నా పేదోడి పొయ్యిపై నాలుగు మెతుకులు ఉడకడం లేదు.

ఇది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ(రామ) రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజా సంక్షేమం లేకపోగా పైగా పేదల బాధలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. చదువు, వైద్యం కార్పొరేట్ల పరమైంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు సిపిఐ(ఎం) లాంటి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రతిఘటిస్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్ వేస్తున్న పాచికే రామరాజ్యం. ఇదే పదేండ్లలో మోడీ దేశానికి చేసిన నిస్వార్థ నిర్వాకం. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన సందర్భంగా మోడీ వేస్తున్న అడుగులను ఈ దేశంలోని యువకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు గమనించాలి. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన భారత లౌకికత్వాన్ని ఓటు ద్వారా బలపరచాలి. అంధ విశ్వాసాల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News