Friday, December 20, 2024

ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi Speech at SCO Summit 2022

సమర్కండ్(ఉజ్బెకిస్థాన్): ప్రపంచంలో షాంఘై సహకార సంఘం(ఎస్‌సిఓ) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎస్‌సిఓ సదస్సులో శుక్రవారం మోడీ మాట్లాడుతూ నేడు ప్రపంచం కొవిడ్ మహమ్మారిని అధిగమిస్తోందని, ఈ సమయంలో ఎస్‌సిఓ పాత్ర చాలా చాలా ముఖ్యమైందని అన్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం ఎస్‌సిఓ సభ్య దేశాల్లో నివసిస్తున్నారన్నారు. అంతేకాదు ప్రపంచ జిడిపిలో 30 శాతం వాటా ఈ దేశాలదేనన్నారు. ఎస్‌సిఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని భారత్ సమర్థిస్తుందన్నారు. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రపంచం మునుపెన్నడూ లేని విధంగా ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటోందని చెప్పారు. వైవిధ్య భరితమైన సరఫరా వ్యవస్థలను ఎస్‌సిఓ ప్రోత్సహించాలని అన్నారు. దీనికోసం మెరుగైన సరఫరా వ్యవస్థ ఒక్కటే చాలదని, మెరుగైన రవాణా సదుపాయాలు అవసరమని అన్నారు.్ర పజలు కేంద్రంగా అభివృద్ధి విధానాన్ని అమలు చేయడంపై తాము దృష్టిపెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోను సృజనాత్మకత, నవ కల్పనలకు మద్దతు ఇస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు.ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని భావిస్తున్నామని, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికమని ఆయన చెప్పారు. నేటికి భారత దేశంలో 100కు పైగా యూనికార్న్‌లు, 70,000కు పైగా స్టార్టప్‌కంపెనీలు ఉన్నాయన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోడీ ఎస్‌సిఓ సభ్య దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. అంశాలవారీగా ప్రాంతీయ, జాతీయ సమస్యలపై ఈ చర్చలు జరిగాయి. ప్రాంతీయ శాంతిభద్రతలు, వ్యాపారం, వాణిజ్యం,అనుసంధానం, సంస్కృతి, పర్యాటక రంగాలపై చర్చలు జరిగాయి.
నో స్మైల్.. నో షేక్‌హ్యాండ్
దాదాపు 28 నెలల క్రితం తూర్పు లడఖ్‌లో భారత్‌చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఫోటో సెషన్‌లో వీరిద్దరూ పక్కపక్కనే నిలబడి ఎస్‌సిఓ నేతలతో కలిసి గ్రూపు ఫోటో దిగారు. అయితే ఇద్దరూ పలకరించుకోవడం కానీ, కరచాలనాలు చేయడం కానీ కనీసం చిరునవ్వులు కూడా లేకపోవడం గమనార్హం. కాగా వీరిద్దరూ పక్కపక్కన నిలుచోవడాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నించింది.

భారత్‌లో సదస్సుకు చైనా మద్దతు
మరో వైపు ఎస్‌సిఓ సదస్సు సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వాణిజ్యాన్ని మరింతగా మెరుగుపర్చుకునే మార్గాలు, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు ఎస్‌సిఓ కూటమి దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. కాగా వచ్చే ఏడాది ఎస్‌సిఓ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి జిన్‌పింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎస్‌సిఓలో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాక్‌లు సభ్య దేవాలుగా ఉండగా సమర్కండ్ సదస్సులో ఇరాన్ కూటమిలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరనుంది.

PM Modi speech at SCO Summit 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News