Saturday, November 23, 2024

విశ్వాస లోటుకు ముగింపు పలకండి

- Advertisement -
- Advertisement -

విశ్వాస లోటుకు ముగింపు పలకండి
ప్రపంచ దేశాధినేతలకు ప్రధాని మోడీ పిలుపు
జి20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
సదస్సు ప్రారంభంలో ప్రకటించిన ప్రధాని మోడీ 
ఎయు చేరికతో పేద దేశాల వాణి బలోపేతమవుతుందని ఆశాభావం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న విశ్వాస లోటుకు ముగింపు పలకాలని జి20 శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత్ పిలుపునిచ్చింది. అంతేకాకుండా జి20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం మంజూరు చేసినట్లు కూడా ప్రకటించింది. 55 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆఫ్రికన్ యూనియన్‌ను జి20 కూటమిలో చేర్చుకోవడానికి సంబంధించి సదస్సు ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనకు జి20 కూటమిలోని సభ్య దేశాలన్నీ కూడా అంగీకారం తెలిపాయి. భారత్ జి20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు కూటమిలో సభ్యత్వం లభించడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశంగా చేరడంతో జి20తో పాటుగా గ్లోబల్ సౌత్( పేద దేశాల)వాణి బలోపేతం అవుతుందని మోడీ అన్నారు.

సుమారు 55 దేశాలు, 130 కోట్లకు పైగా జనాభా, ౩ ట్రిలియన్ డాలర్ల జిడిపి కలిగి ఉన్న ఆఫ్రికన్ యూనియన్ చేరడంతో జి 20 కూటమి ప్రపంచానికి మరింత చేరువయినట్లయింది.‘ ప్రపంచం బాగు కోసం మనమంతా కలిసి నడవాల్సిన సమయం వచ్చింది’ అని జి20 సదస్సులో తొలి సెషన్ అయిన ‘ఒన్ ఎర్త్’ సెషన్‌లో మాట్లాడుతూ ప్రధాని అన్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోఫ్ఫ్రెన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటుగా యుఎఇ, బంగ్లాదేశ్ టర్కీ, కెనడా, ఇటలీ. దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు కలిసి 1999లో జి20 కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. ఇప్పుడు ఆ అరుదైన గౌరవం ఆఫ్రికన్ యూనియన్‌కు దక్కింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ అందరితో కలిసి( సబ్‌కా సాథ్) అనే భావనకు అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జి20 కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ప్రతిపాదిస్తోందని అన్నారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని అన్నారు. ‘మీ అంగీకారంతో…’ అని అంటూ జి20లోకి ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశించినట్లు తెలియజేస్తూ సుత్తితో చిన్నగా మూడు సార్లు కొట్టారు. ‘మనం పని ప్రారంభించడానికి ముందు శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించాల్సిందిగా ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడ్ని ఆహ్వానిస్తున్నాను’అని అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రమణియన్ జైశంకర్ ప్రస్తుత ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్ , కొమరోస్ ప్రెసిడెంట్ అజలి అసౌమనీని సాదరగా ఆయనకు కేటాయించిన స్థానం వద్దకు తీసుకువచ్చారు. అసౌమనీని మోడీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

అనంతరం మోడీ మాట్లాడుతూ ‘కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచం విశ్వాస లోటు అనే కొత్త సవాలును ఎదుర్కొంటోందని, దురదృష్టవశాత్తు యుద్ధాలు దీన్ని మరింత గంభీరంగా చేసిందని ఆఆయన అన్నారు. అయితే కొవిడ్ లాంటి మహమ్మారిని మనం విజయవంతంగా ఎదుర్కోగలిగినప్పుడు ఈ సవాలును కూడా మనం ఎదుర్కోగలమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విశ్వాస లోపాన్ని విశ్వాసం, నమ్మకంగా మార్చాలని ఈ రోజు జి20 అధ్యక్ష దేశంగా భారత్ మొత్తం ప్రపంచ దేశాలను కోరుతోంది’ అని ప్రధాని మోడీ అన్నారు. పాత సవాళ్లు మననుంచి కొత్త పరిష్కారాలను కోరుకుంటున్న సమయమిది. అందువల ్లమానవతా దృష్టి కోణంతో మనం మన బాధ్యతలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ సంక్షోభంపై జి20 సభ్య దేశాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సు చివర్లో చేయాల్సిన సంయుక్త ప్రకటనపైనా సందిగ్ధత నెలకొంది. అయితే సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌సంక్షోభంపై పొందుపరచాల్సిన ‘ పేరా’, వాడిన బాషను మారుస్తూ భారత్ కొత్త ప్రతిపాదనతో ముసాయిదాను సభ్య దేశాలకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ డిక్లరేషన్‌కు మార్గం సగమం అయిందని చెబుతున్నారు.

అతిరథులను ఆహ్వానించిన వేళ..ఆకట్టుకున్న కోణార్క్ చక్రం
ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న జి20 సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ దేశాల అధినేతలకు వేదిక వద్ద ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానం పలికారు. వారికి స్వాగతం పలికే వేదిక ప్రదేశంలో బ్యాగ్రౌండ్‌లో కోణార్క్ చక్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే అనేక చిహ్నాలను ఈ మండపం వద్ద ఏర్పాటు చేశారు. వాటిలో ఈ చక్రం కూడా ఒకటి. జి20 లోగో ఒక వైపు భారత అధ్యక్షతన జరిగే ఈ సదస్సు థీమ్ అయిన ‘వసుధైవ కుటుంబకం’ అనే నినాదం మరో వైపు ఉన్న ఈ కోణార్క్ చక్రం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టిని సైతం ఆకట్టుకుంది. ప్రధాని మోబీ ఆయనకు దీని ప్రాముఖ్యతను వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News