Friday, July 5, 2024

99కే సంబురాలా?: కాంగ్రెస్ పై ప్రధాని సెటైర్లు

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో విపక్షంపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగం ఆద్యంతం విపక్షాల నీట్, మణిపూర్ నినాదాలతో సభ దద్దరిల్లుతున్నా తన వాగ్ధాటిని కొనసాగించారు. ప్రతిపక్షంపై పదునైన పంచులు విసిరారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచి సంబురాలు చేసుకుందని..మూడు సార్లు అటువైపే కూర్చున్నామని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. రాహుల్‌ను చిన్నపిల్లాడిగా, కాంగ్రెస్‌ను పరాన్నజీవిగా అభివర్ణించారు. హిందూయిజంపై ఇండియా కూటమి నిందలు మోపడమే కాకుండా దుష్ప్రచారానికి ఒడిగడుతోందని దునుమాడారు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు ఒడిగడతామని మోడీ హామీ ఇచ్చారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత దిగువసభ షెడ్యూల్‌కు ఒక రోజు ముందే నిరవధికంగా వాయిదా పడింది.

న్యూఢిల్లీ : ప్రతి ప్రమాణంపై పరీక్షించిన తరువాతే వరుసగా మూడవ సారి సుస్థిరత, కొనసాగింపు కోసం తమ ప్రభుత్వానికి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల చర్చ కు ప్రధాని మోడీ సమాధానం ఇస్తూ, పది సంవత్సరాల పాటు తమకు ఎంత నిబద్ధతతో ప్రభుత్వం సేవ చేసిందో ప్రజలు చూశారని చెప్పారు.

‘మా మూడవ హయాంలో మూడింతల వేగంతో పని చేస్తాం. మా మూడవ హయాం అంటే మూడింతల బలంతో పని చేస్తామని అర్థం. మా మూడవ హయాంలో మూడింతల ఫలితాలు వచ్చేలా చూస్తాం’ అని లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య మోడీ ప్రకటించారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికి, వాదనలు హరించి కేకలు వేస్తూండడానికి బిజెపి ప్రత్యర్థులకు ఈ తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. ‘ప్రజల తీర్పును నిజాయతీతో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి, దీనిని అంగీకరించండి. ప్రజల తీర్పును అంగీకరించాలని, బోగస్ విజయోత్సవాల వెనుక దాగవద్దని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోడీ చెప్పారు.

ప్రధాని సమాధానానికి ముందు సభలో మాట్లాడేందుకు మణిపూర్‌కు చెందిన ఎంపిలను అనుమతించవలసిందని స్పీకర్ ఓమ్ బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేశారు. కాని, ఆ ఈశాన్య రాష్ట్రం నుంచి ఒక సభ్యుడు సోమవారం మాట్లాడారని ఆయన తెలిపారు. వారు అప్పుడు సభాధిపతి వేదిక ముందుకు చొచ్చుకువచ్చారు. దీనితో బిర్లా వారిని తీవ్రంగా మందలించారు. ‘మమ్మల్ని ప్రతి అంశంపై పరీక్షించిన తరువాత దేశ ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు. మా పది సంవత్సరాల ట్రాక్ రికార్డును ప్రజలు చూశారు’ అని ప్రధాని తెలియజేశారు. ‘పేదల సంక్షేమం కోసం అంకితభావంతో మేము పని చేశామని, ‘ప్రజల సేవే భగవంతును సేవ’ అనే మంత్రాన్ని సాఫల్యంచేశామని ప్రజలు చూశారు’ అని ఆయన తెలిపారు.

కొంత మంది బాధను తాను అర్థం చేసుకోగలనని, వారు అబద్ధాలు ప్రచారం చేసినప్పటికీ, ప్రజలను తప్పుదోవ పట్టించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడవలసి వచ్చిందని ప్రధాని చెప్పారు. ‘ఈ బృహత్ ఎన్నికల ప్రక్రియలో జనం మమ్మల్ని ఎంచుకున్నారు. కొందరు అసత్యాలు ప్రచారంచేసినప్పటికీ దారుణంగా ఓడిపోయినందుకు వారి బాధను అర్థం చేసుకోగలను’ అని ఆయన అన్నారు. ‘మణిపూర్‌కు న్యాయం’ అంటూ ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న నినాదాల మధ్య మోడీ ఆ మాటలు అన్నారు. వరుసగా మూడు పర్యాయాలు 100 సీట్లను దాటలేకపోవడం కాంగ్రెస్ చరిత్రలో ఇదే ప్రథమం అని మోడీ పేర్కొన్నారు.

‘కాంగ్రెస్‌కు ఇది మూడవ భారీ పరాజయం. కాంగ్రెస్ ఓటమిని అంగీకరించి, ఒకింత పునరాలోకనం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ, అది శీర్షాసనం వేయడంలో నిమగ్నమైంది. తాము మమ్మల్ని ఓడించామనే భావనను ప్రజల మనస్సుల్లో చొప్పించేందుకు కాంగ్రెస్, దాని వ్యవస్థ ప్రయత్నిస్తున్నాయి’ అని మోడీ అన్నారు. ‘మేము 2014లో గెలిచినప్పుడు అవినీతిని సహించబోమనే నినాదం ఇచ్చాం… 2014కు అవినీతి కోరల్లో చిక్కుకుని సతమతం అయిన సామాన్య ప్రజలు అవినీతిని సహించజాలమన్న మా నినాదానికి మమ్మల్ని ఆశీర్వదించారు’ అని ఆయన చెప్పారు. భారత ప్రతిష్ఠ ఇనుమడించిందని, దేశంవైపు ప్రపంచం చూస్తున్నదని ప్రధాని తెలిపారు. “దేశమే ముందు’ అన్న మా ప్రధాన లక్షాన్ని దేశం చూసింది. మా ప్రతి అడుగు, కార్యాచరణ ‘దేశమే ముందు’ అన్న లక్షంతోనే సాగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు కొనసాగించాం.

బుజ్జగింపులలో కాకుం డా అందరినీ సంతుష్టులను చేయడంలోనే మాకు విశ్వాసం ఉంది’ అని మోడీ చెప్పారు. బుజ్జగింపుల విధానం దేశానికి హాని చేసిందని ఆయన అన్నారు. ‘గడచిన పది సంవత్సరాల్లో మా కృషిని చూసిన తరువాత జనం మాకు మద్దతు ఇచ్చారు. 140 కోట్ల మంది (దేశ) ప్రజలకు సేవ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చారు. ఈ దేశ ప్రజల పరిణతిని ఈ ఎన్నికలు చూపాయి’ అని ప్రధాని చెప్పారు. 2014కు ముందు ప్రజలు ఆత్మ విశ్వాసం కోల్పోయారని మోడీ తెలిపారు. ‘ఆత్మ విశ్వాసం లేనప్పుడు మనిషికి, దేశానికి నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. ఈ దేశ ప్రజలు ఏదీ సాధించజాలదని సామాన్య ప్రజలు అంటుండేవారు. కుంభకోణాల వార్తలు మాత్ర మే వస్తుండేవి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో ఆర్థిక అరాచకం సృష్టికి కాంగ్రెస్ ప్రయత్నించిందని కూడా మోడీ ఆరోపించారు.

రాహుల్‌ది ‘చిన్న పిల్లవాడి చేష్ట’
ప్రధాని మోడీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్షంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ‘చిన్న పిల్లవాడి తత్వం’తో ఒక వ్యక్తి రోదనను సభ వీక్షించిందని, ఆయన తన తప్పులను బహిర్గతం చేయకుండా సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నించారని మోడీ చెప్పారు. సానుభూతి పొందేందుకు లోక్‌సభలో కొత్త నాటకానికి తెర లేపారని ప్రధాని ఆరోపించారు. ‘వేల కోట్ల రూపాయల స్వాహాకు బెయిల్‌పై విడుదల అయ్యామని, ఒబిసి ప్రజలను దొంగలుగా పేర్కొన్నందుకు దోషులుగా తమను నిర్ధారించారని, దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బాధ్యతారహిత వ్యాఖ్యలకుగాను తాము క్షమాపణ చెప్పుకోవలసి వచ్చిందని వారికి తెలుసు’ అని రాహుల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని చెప్పారు.

అగ్నిపథ్ పథకంపై, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించే యత్నం జరిగిందని మోడీ ఆరోపించారు. ఆయన (రాహుల్) వంటి ఢక్కామొక్కీలు తిన్న నేతలు ఈ అరాచక పంథా ఎంచుకున్నప్పుడు దేశం ఇక్కట్ల పాలవుతున్నదని అది సూచిస్తోంది’ అని ప్రధా ని చెప్పారు. ‘స్పీకర్ సార్! మీరు ప్రతిదీ చిరునవ్వుతో సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ జరిగిన దానిపై ఏదో ఒకటి చేయవలసి ఉంది. లేకపోతే అది పార్లమెంట్‌కు మంచిది కాదు. అటువంటి యత్నాల ను ‘చిన్నపిల్లల చేష్ట’గా పేర్కొ ని అలక్షం చేయకూడదు. తీవ్రమైన కుట్ర ఉంది’ అని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News