అప్పులపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య మాట ల యుద్దం జరుగుతోంది. ‘నువ్వెంత అంటే ను వ్వెంత’ అనే రేంజ్‌లో విమర్శలు కొనసాగుతున్నా యి. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో అప్పులపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆగ్రహావేశాలకు గురిచేశాయి. ‘తాను చేస్తే ఒప్పు.. ఇతరు లు చేస్తే తప్పు’ అన్నట్లుగా ప్రధాని నరేంద్రమోడి వ్యవహారం ఉందని రాష్ట్రాలు మండిపడుతున్నా యి. రికార్డుస్థాయిలో దేశాన్ని అప్పుల ఊబిలోకి పడేసిన వ్యక్తి రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయవద్దని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందనీ వ్యా ఖ్యానాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ద్రవ్యవినిమయ బిల్లుపై స్పందిస్తూ సుధీర్ఘంగా చేసిన ప్రసంగం దేశంలో దావానలంలా వ్యాపించింది. ఇతర రాష్ట్రాల ఆర్థికశాఖల ఉన్నతాధికారులు సైతం తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధిక శాఖాధికారులకు ఫోన్లు చేసి మరీ అభినందించినట్లు తెలిసింది. మా కూడా మీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని, కేంద్రం అప్పుల విధానాన్ని ఎండగట్టిన తీరు అద్భుతమని ప్రశంసించినట్లు తెలిసింది.
తాము కూడా జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను చదివి అర్థ్ధం చేసుకున్నట్లు పలు ఇతర రాష్ట్రాల ఆర్థ్ధికశాఖల ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులతో తమతమ అభిప్రాయాలను పంచుకొన్నట్లుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్) సంస్థలు ఇచ్చిన నివేదికలు అనేక చేదు నిజాలను బయటపెట్టాయని, వాటిల్లోని అంశాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీ నుంచి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్తు దేశానికే కేంద్ర ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేశారని వారు వ్యాఖ్యానించినట్లుగా ఓ సీనియర్ అధికారి వివరించారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన అధికారుల్లో కేంద్ర ప్రభుత్వ అప్పులపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థ్ధికశాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ఏడాది మార్చి నెల 31వ తేదీ నాటికి రూ.152,61,122.12 కోట్లు ఉంటాయని, అదే విధంగా 2024 మార్చి 31 నాటికి రికార్డుస్ఠాయిలో రూ.169,46,666.85 కోట్లకు చేరుకుంటాయని తాజాగా ప్రవేశపెట్టిన సర్వే వివరించింది.
ఇందులో దేశ అంతర్గత అప్పులు ప్రస్తుతం వచ్చే నెలాఖరుకు రూ.147,77,724.43 కోట్లు కాగా, ఎక్స్‌టర్నల్ (విదేశీ అప్పులు) డెబ్ట్ 4,83,397.69 కోట్లు ఉంటుందని ఆర్ధిక సర్వే తెలిపింది. కాగా 2024 మా ర్చి 31వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చేసే అప్పులు 164, 23,983.04 కోట్లు కాగా విదేశీ అప్పులు 5,22,683.81 కోట్లకు పెరుగుతాయని వివరించింది. అంటే కేంద్ర ప్రభుత్వ అప్పులు దేశ జిడిపిలో రికార్డుస్థాయిలో 87 శాతానికి పెరుగుతాయని తెలిపిందని ఆ అధికారులు వివరించా రు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జిడిపి గ్రోత్‌రేట్ 10.5 శాతం ఉన్నట్లుగా పార్లమెంట్ ఉభయ సభలకు తెలిపిందని, కానీ ఆర్ధిక సర్వే మాత్రం కేం ద్ర ప్రభుత్వ జిడిపి గ్రోత్‌రేట్ కేవలం 6.5 శాతం మాత్రమే ఉందని నిగ్గుతేల్చిందని ఆ అధికారులు వివరించారు. ఈ అంశాలే ప్రస్తుతం దేశంలోని అన్ని రా ష్ట్రాల ఆర్ధికశాఖాధికారుల్లో హాట్ టాపిక్‌గా మారాయని ఆ అధికారులు వివరించారు. 2021లో కేంద్ర అప్పులు 84 శాతం ఉండగా, 2022వ ఆర్థ్ధిక సం వత్సరంలో జిడిపిలో 83 శాతానికి పరిమితమయ్యాయి.
నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశం అప్పులు సుమారు 80 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని, అవన్నీ 70 ఏళ్ళల్లో చేసిన అప్పులని, కానీ నరేంద్రమోడీ ప్రధాని అయిన ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశం అప్పులు సుమారు 153 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. అంటే 8ఏళ్ళల్లో అప్పులను రెట్టింపు చేసిన ఘనుడు నరేంద్రమోడీ అని, అలాంటి వ్యక్తి రాష్ట్రాలు చేసే అప్పులపై సుద్దులు (నీతులు) చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ అధికారులు చర్చించుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన 1.50 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోపారని ఆ అధికారులు వివరించారు. ఈ మొత్తం వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి అప్పులు చేస్తే రాష్ట్రాలు, దేశం యావత్తూ ఒక శ్రీలంక మాదిరిగా, ఒక పాకిస్థాన్ మాదిరిగా ఆర్ధికంగా దివాళా తీస్తామని ప్రధాని నరేంద్ర మోడి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనే అంశంపైనే దాదాపు అన్ని రాష్ట్రాల ఆర్ధికశాఖల్లో వాడివేడి చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
అమాయక ప్రజలను మభ్యపెట్టవచ్చునేమోగానీ ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షించే ఐఎఎస్ అధికారులతో పాటుగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఆర్ధికవేత్తలకు దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తం అర్ధమవుతుందని, అలాంటప్పుడు మోడీ ఇలా నిరాఘాటంగా, నిండుసభలో సైతం ఎలా అబద్ధాలు చెబుతారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం దేశం మొత్తం జిడిపిలో 60 శాతానికి మించి అదనంగా అప్పులు చేయకూడదని 2017వ సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందించిందని, ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జిడిపిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని వివరించారు. అదే చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదనే నిబంధన ఉందని వివరించారు. ఈ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని అనేక సంవత్సరాలుగా యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోందని, అంతేగాక కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా, సన్నిహితంగా ఉన్న రాష్ట్రాలకు కూడా ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిధులకు మించి, అంటే తలకుమించిన స్థాయిలో
అప్పులు చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇస్తూ వస్తోందని, అయినప్పటికీ ఈ వాస్తవాలన్నింటినీ పక్కనబెట్టి అప్పులు చేయవద్దని ప్రధాని నిండుసభల్లో ప్రకటించడం విడ్డూరంగానే ఉందని, అందుకే దేశవ్యాప్తంగా అప్పులపై ఇంత పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంపై ఉన్న రాజకీయ వైరుధ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్ధికంగా ఏ మాత్రం సహకరించకపోగా న్యాయంగా, చట్టబద్దంగా, హక్కుగా రుణాలను సేకరించుకునే అవకాశాలపైన కూడా కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తూ అడ్డుపడుతూనే వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో కేవలం 23.8 శాతానికి పరిమితమయ్యాయని, కానీ కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణలో అభివృద్ధికి మోకాలడ్డుతోందని ఈ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. ప్రతి నెలా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్న పంజాబ్ రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో
రికార్డుస్థాయిలో 53.3 శాతం ఉన్నాయని, అప్పుల్లో ఈ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతోందని, అయినప్పటికీ ప్రతినెలా రుణాల సేకరణకు కేంద్రం అనుమతులు ఇస్తూనే ఉందని వివరించారు. అదే విధంగా అప్పుల్లో రాజస్థాన్ రాష్ట్రం 39.8 శాతంతో రెండోస్థానంలో కొనసాగుతుండగా 38.8 శాతం అప్పులతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టంచేస్తున్నాయని వివరించారు. కేరళ రాష్ట్రం అప్పులు 38.3 ఉండగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఆ రాష్ట్ర జిఎస్‌డిపిలో 37.6 శాతం వరకూ ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఏపీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలున్నందున కొత్తకొత్త అప్పులకు యధేచ్ఛగా అనుమతులు లభిస్తున్నాయని వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం అండదండలున్న కొన్ని రాష్ట్రాలు కూడా నిరాఘాటంగా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆ అధికారులు వివరించారు.