ప్రధాని మోడీ ఉద్ఘాటన
తంకారా (గుజరాత్) : భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ ఈనాటి అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉద్ఘాటించారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి జన్మ స్థలం గుజరాత్ మోర్బీ జిల్లాలోని తంకారాలో ఆయన 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రజలు బానిసత్వంతో మగ్గుతున్న, దేశాన్ని మూఢవిశ్వాసాలు కమ్ముకున్న కాలంలో వేదాధ్యయనాన్ని భారతీయ సమాజం తిరిగి ఆరంభించాలని సంఘ సంస్కర్త స్వామి దయానంద్ సరస్వతి పిలుపు ఇచ్చారని మోడీ గుర్తు చేశారు.
‘భారతీయ విలువలతో కూడిన వివ్యా విధానం ప్రస్తుత అవసరం. ఆర్య సమాజ్ పాఠశాలలు ఇందుకు కేంద్రంగా ఉన్నాయి. దేశం ఇప్పుడు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) ద్వారా విస్తరిస్తోంది. ఈ ప్రయత్నాలతో సమాజాన్ని అనుసంధానించడం మన బాధ్యత’ అని ప్రధాని చెప్పారు. భారతీయులు బానిసత్వం, సామాజిక చెడుగుల వలయంలో చిక్కుకున్న సమయంలో స్వామి దయానంద్ సరస్వతి జన్మించారని ఆయన తెలిపారు.
‘సమాజంలో ఒక వర్గం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు దూరంగా సాగుతున్నది. అటువంటి సమయాలలో స్వామి దయానంద్‌జీ వేదాధ్యయనాన్ని తిరిగి ప్రారంభించాలని పిలుపు ఇచ్చారు’ అని మోడీ గుర్తు చేశారు. భారత్ ‘అమృత్ కాల్’ తొలి సంవత్సరాలతో ఉన్న తరుణంలో స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతి మైలురాయి సంభవించిందని మోడీ పేర్కొన్నారు.