హిరోషిమా : ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి చివరికి ఇప్పుడు పిచ్చాపాటి వేదికలుగా మారనున్నాయని ప్రధాని మోడీ జి 7 సదస్సు నుంచి చేసిన ప్రసంగంలో తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రపంచ వేదికలు ప్రస్తుత ప్రపంచ వాస్తవికతలను ప్రతిఫలించకపోతే సంస్థలుగా అవి నిరర్ధకం అవుతాయన్నారు. శాంతి సుస్థిరతల పరిరక్షణ బాధ్యత ఐరాసపై ఉంది. మరి వీటికి సవాళ్లు ఏర్పడినప్పుడు వివిధ వేదికల నుంచి ఎందుకు వీటిపై వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రపంచంలో తలెత్తే ఘర్షణలను నివారించుకునేందుకు ఐరాస ఏర్పడినప్పుడు, మరి ఈ బాధ్యతల నిర్వహణలో ఈ సంస్థ ఎందుకు విఫలం అవుతోందని సందేహం వ్యక్తం చేశారు.
చివరికి ఐరాస వేదిక ఇంతవరకూ ఉగ్రవాదంపై నిర్వచనం విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. వీటిన్నింటిని బేరీజు వేసుకుంటే ఒక్క విషయం స్పష్టం అవుతోంది. గత శతాబ్ధంలో ఏర్పాటు అయిన ఈ సంస్థ ఇప్పటి వాస్తవికతలను గుర్తించడం లేదు. 21వ శతాబ్ధానికి అనుగుణంగా అప్‌డేట్ కాలేదనే గుర్తించాల్సి ఉంటుందన్నారు. ఐరాసలో భారీ స్థాయి సంస్కరణల ప్రక్రియకు భారతదేశం డిమాండ్ చేస్తోందన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి ఏళ్ల తరబడిగా విఫలయత్నానికి దిగుతూ వస్తోంది.