Sunday, January 19, 2025

అంబేద్కర్‌పై అవమానాలను కాంగ్రెస్ అసత్యాలు దాచలేవు:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌ను అవమానించారన్న కాంగ్రెస్ ఆరోపణ నుంచి మంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గట్టిగా సమర్థించారు. రాజ్యాంగ నిర్మాతను ‘కించపరచిన కాంగ్రెస్ నల్ల చరిత్ర’ను హోమ్ శాఖ మంత్రి వాస్తవానికి బహిర్గతం చేశారని, అందుకు ప్రధాన ప్రతిపక్షం ‘దిగ్భ్రమ చెందింది’ అని మోడీ ఉద్ఘాటించారు. ‘ఆయన చెప్పిన వాస్తవాలకు వారు స్పష్టంగా కంగు తిన్నారు, దిగ్భ్రమ చెందారు. అందుకే వారు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు, వారికి విచారకరం ఏమిటంటే ప్రజలకు నిజం తెలుసు’ అని మోడీ ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లలో పేర్కొన్నారు. అంబేద్కర్‌కు సంబంధించి ఆయనపై తన ప్రభుత్వానికి గౌరవం పరిపూర్ణమైనదని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ‘ఆ పార్టీ, దాని ‘కుళ్లిపోయిన వ్యవస్థ’ తమ ‘దురుద్దేశపూర్వక అసత్యాలు’ అనేక సంవత్సరాల పాటు సాగిన తమ దుష్కృత్యాలను, ముఖ్యంగా అంబేద్కర్ పట్ల వారి అవమానాలను కప్పిపుచ్చగలవని భావిస్తుంటే వారు బాగా పొరబడ్డారన్నమాటే అని అన్నారు.

నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఒక వంశం నాయకత్వంలో ఒక పార్టీ పదే పదే అంబేద్కర్ వారసత్వ సంపదను తోసిరాజనడానికి, ఎస్‌సి/ ఎస్‌టి వర్గాలను కించపరచడానికి నానా ఎత్తుగడలు వేయడాన్ని దేశ ప్రజలు తిలకగించారని ఆయన తెలిపారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ పాపాల్లో ఎన్నికల్లో ఒకసారి కాదు రెండు సార్లు ఓడించడం కూడా ఉందని, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, ఆయన ఓటమిని ప్రతిష్ఠాకర అంశంగా మార్చారని, ఆయనకు భారత రత్న నిరాకరించారని, ఆయన చిత్రపటానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో గౌరవప్రద స్థానం ఇవ్వలేదని ప్రధాని వివరించారు. ‘కాంగ్రెస్ తాము కోరుకున్న విధంగా ఎన్ని ప్రయత్నాలైనా చేయవచ్చు కానీ తమ హయాంలలోనే ఎస్‌సి/ ఎస్‌టి వర్గాలపై హీనమైన మారణకాండలు సంభవించాయన్నది వారు కాదనజాలరు. ఏళ్ల తరబడి వారు అధికారంలో ఉన్నారు కానీ ఎస్‌సి/ ఎస్‌టి వర్గాల సాధికారతకు తగిన చర్య ఏదీ వారు తీసుకోలేదు’ అని మోడీ ఆరోపించారు. మోడీ కారణంగానే ‘మేము ఈ స్థితిలో ఉన్నాం’

అని మోడీ పేర్కొంటూ, ఆయన లక్షం సాఫల్యానికి, ఆ దిగ్గజ వ్యక్తికి గౌరవం కల్పనకు తన ప్రభుత్వం తీసుకున్న వరుస చర్యలను వివరించారు. గత దశాబ్ద కాలంగా అంబేద్కర్ కల నెరవేర్చడానికి తన ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ప్రధాని తెలియజేశారు. ‘ఏ రంగాన్నైనా తీసుకోండి & పేదరికం నుంచి 25 కోట్ల మందిని బయటకు తీసుకురావడమైనా, ఎస్‌సి/ ఎస్‌టి చట్టాన్ని పటిష్ఠం చేయడమైనా, స్వచ్ఛ్ భారత్, పిఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన వంటి మా ప్రభుత్వ ప్రధాన పథకాలైనా, వాటిలో ప్రతిదీ నిరుపేదలు, బడుగు వర్గాల దరి చేరింది. డాక్టర్ అంబేద్కర్‌తో సంబంధం ఉన్న ఐదు దిగ్గజ ప్రదేశాలు పంచ్‌తీర్థ్ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పాటుపడింది’ అని ఆయన తెలిపారు. అంబేద్కర్ అంత్యక్రియలు జరిగిన ‘చైత్య భూమి’ కోసం స్థలానికి సంబంధించిన సమస్య దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉందని మోడీ పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడమే

కాకుండా నేను అక్కడికి ప్రార్థన చేయడానికీ వెళ్లాను’ అని మోడీ తెలిపారు. ‘డాక్టర్ అంబేద్కర్ తన చివరి సంవత్సరాలు ఢిల్లీలో గడిపిన 26, అలీపూర్ రోడ్ భవనాన్ని కూడా అభివృద్ధి చేశాం. లండన్‌లో ఆయన నివసించిన ఇంటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. డాక్టర్ అంబేద్కర్ విషయానికి వస్తే ఆయన పట్ల మా గౌరవం పరిపూర్ణం’ అని మోడీ తెలిపారు. కాగా, అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ లోక్‌సభ, రాజ్యసభలలో కాంగ్రెస్, కొన్ని ఇతర ప్రతిపక్షాలు గట్టిగా నిరసనలు వ్యక్తం చేశాయి. దీనితో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News