Monday, December 23, 2024

ప్రధాని గొంతు నొక్కే యత్నం చేశారు: మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉన్నది పార్టీ కోసం కాదని, దేశం కోసం అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తుతూ, తమ రాజకీయ వైఫల్యాలను మరుగుపరచుకోవడానికి కొన్నిపార్టీలు ‘ప్రతికూల రాజకీయాలు’ చేశాయని, పార్లమెంట్‌ను ‘దుర్వినియోగం చేశాయి’ అని మోడీ విమర్శించారు. పార్లమెంట్ సెషన్‌కు ముందు మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడుతూ, మంగళవారం ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ వచ్చే ఐదు సంవత్సరాల ప్రస్థానానికి మార్గాన్ని నిర్దేశిస్తుందని, 2047లో ‘వికసిత్ భారత్’ కల సాఫల్యానికి పునాది వేస్తుందని సూచించారు.

ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తమ తీర్పు వెలువరించారని, వచ్చే ఐదు సంవత్సరాలకు దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సంఘటితంగా పోరాడాలని అన్నారు. ‘ఎంపిలు ఏ పార్టీవారైనా కావచ్చు, మనం ఎన్నికల పోరు సాగించిన జనవరి నుంచి మనం ఏమి చెప్పాలని అనుకున్నామో తెలియజేశామని, కొంత మంది మార్గం సూచించారని, మరికొందరు తప్పుదారి పట్టించారని, కాని ఆ కాలం ఇప్పుడు ముగిసిందని అందరికీ స్పష్టం చేయదలచుకున్నా. ప్రజలు తమ తీర్పు ఇచ్చారు’ అని ఆయన తెలిపారు. ‘మన సంబంధిత పార్టీల కోసం పోరాడామని, వచ్చే ఐదు సంవత్సరాలకు దేశం కోసం మనం పోరాడడం, కృషి చేయవలసి ఉండడం ఎన్నికైన అందరు ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల బాధ్యత’ అని మోడీ నొక్కిచెప్పారు.

పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, వచ్చే నాలుగు, నాలుగున్నర సంవత్సరాలకు పార్లమెంట్ వేదికను వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ‘2029 జనవరి ఎన్నికల సంవత్సరం అయినప్పుడు మీరు ఎన్నికల క్షేత్రానికి వెళ్లవచ్చు, అందుకు పార్లమెంట్‌ను సైతం వినియోగించుకోవచ్చు. ఆ ఆరు మాసాల కోసం మీరు కోరుకున్న ఆటలు ఆడండి. కాని అప్పటి వర కు 2047 కల సాఫల్యానికి ప్రజల భాగస్వామ్యానికి ఒక ఉద్యమం నిర్మించడం ద్వారా నిరుపేదలు, రైతులు, యువజనులు, మహిళల సాధికారత కోసం కృషి చేయండి’ అని మోడీ పిలుపు ఇచ్చారు. ‘2014 తరువాత కొందరు ఎంపిలు ఐదు సంవత్సరాలకు ఎన్నికయ్యారు, మరి కొందరు పది సంవత్సరాలకు ఎన్నికయ్యారు, కానీ పార్లమెంట్‌లో తమ నియోజకవర్గం గురించి మాట్లాడేందుకు.

తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అనేక మంది ఎంపిలకు అవకాశం లభించలేదని, తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంట్‌ను దుర్వినియోగం చేసిన కొన్ని పార్టీల ప్రతికూల రాజకీయాలే అందుకు కారణమని ఎంతో బాధతో చెబుతున్నాను’ అని ఆయన తెలిపారు. మొదటిసారి గెలిచిన ఎంపిలకు పార్లమెంట్‌లో మాట్లాడనివ్వాలని, వారి అవకాశాలు ఇవ్వాలని అన్ని పార్టీలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ‘ఈ లోక్‌సభ తొలి సెషన్‌లో మీరు చూసే ఉంటారు. సేవ చేయాలని 140 కోట్ల మంది భారతీయులు ఆదేశించిన ప్రభుత్వం గొంతు నొక్కేందుకు అప్రజాస్వామిక యత్నంజరిగింది. రెండున్నర గంటల సేపు ప్రధాని వాణిని అణచివేసే ప్రయత్నాలు సాగాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో అటువంటి పనికి ఆస్కారం లేదు. దానిపై వారికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు’ అని మోడీ పేర్కొన్నారు.

గత సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇస్తున్నప్పుడు మణిపూర్ ఎంపిలు ఇద్దరినీ మాట్లాడనివ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు పెద్ద పెట్టున నిరసనలు తెలియజేసిన, నినాదాలు చేసిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘జనం దళ్ కోసం కాకుండా దేశం కోసం మనల్ని ఇక్కడకు పంపారు. ఈ పార్లమెంట్ ఉన్నది దళ్ (పార్టీ) కోసం కాదు, కానీ దేశం కోసం. ఈ పార్లమెంట్ ఎంపిలకే పరిమితం కాదు కానీ 140 కోట్ల మంది దేశ ప్రజల కోసం ఉన్నది’ అని ఆయన స్పష్టం చేశారు. ఎంపిలు అందరూ చర్చకు దోహదం చేస్తారనే ఆశాభావాన్ని మోడీ వ్యక్తం చేశారు. అభిప్రాయాల వ్యక్తం చేయడంలో తప్పు లేదని, కానీ ప్రతికూల అభిప్రాయాల వ్యక్తీకరణే తప్పు అని ఆయన అన్నారు. దేశానికి ప్రతికూలత అవసరం లేదని ఆయన చెప్పారు.

‘అభివృద్ధి, పురోగతి లక్షంతో దేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్లవసి ఉంటుంది’ అని మోడీ సూచించారు. మన ప్రజాస్వామ్యం సగర్వ ప్రస్థానంలో వర్షాకాల సెషన్ ఒక ముఖ్యమైన గమ్యస్థానం అని కూడా ప్రధాని మోడీ అన్నారు. ‘సుమారు 60 ఏళ్ల తరువాత ఒక ప్రభుత్వం మూడవ సారి తిరిగి అధికారంలోకి రావడం, మూడవ హయాం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం లభించడం స్వయంగా నాకు, మా సహచరులు అందరికీ అత్యంత గర్వకారణం. భారతీయ ప్రజాస్వామ్యం మహోజ్వల ప్రస్థానంలో దీనిని అత్యంత గర్వకారక ఘటనగా దేశం చూస్తోంది’ అని ఆయన చెప్పారు. ప్రజలకు తాను ఇచ్చిన గ్యారంటీల అమలుకు తన ప్రభుత్వం ముందుకు సాగుతోందని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News