న్యూఢిల్లీ: గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భౠరతీయ గేమర్లతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గేమర్లతో ప్రధాని మోడీ చర్చలకు సంబంధించిన చిన్న వీడియోను ఆయన షేర్ చేశారు. గేమింగ్ పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులను గురించి వారు చర్చించారని, దేశంలో గేమింగ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం గేమర్ల సృజనాత్మకతను ఏ విధంగా గుర్తించిందో మోడీ వివరించారని మాలవీయ తెలిపారు.
గ్యాంబ్లింగ్‌కు, గేమింగ్‌కు మధ్య తేడాను సంబంధించిన అశాలను చర్చించడంతోపాటు గేమింగ్ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా వారు ప్రస్తావించారని ఆయన వివరించారు. తీర్థ మెహతా, పాయల్ ధారే, అనిమేష్ అగర్వాల్, అన్షు బిష్త్, నామన్ మాథుర్, మిథిలేష్ పటంకర్, గణేస్ గంగాధర్ వంటి భారతీయ అగ్ర గేమర్లతో పిసి, విరా గేమ్లను ప్రధాని మోడీ ఆడినట్లు ఆయన తెలిపారు. చర్చలకు సంబంధించిన పూర్తి వీడియోను త్వరలో విడుదల చేస్తామని మాలవీయ తెలిపారు.